పరుగుల వర్షం కురిపించిన సూర్యకుమార్

టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్టీ 20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్లో  సూర్యకుమార్  రెచ్చిపోయాడు. మొత్తం 6 మ్యాచుల్లో 239 పరుగులు సాధించాడు.  ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. దీంతో టీ20 ర్యాంకింగ్స్లో అగ్ర స్థానంలో నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్ ముగిసినా సూర్య జోరు కొనసాగుతోంది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో వీరబాదుడు బాదాడు. కివీస్ బౌలర్లను వారి గడ్డపైనే ఉతికారేశాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 111 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ సాధించేందుకు 32 బంతులు ఎదుర్కొన్న సూర్య..మరో 17 బంతుల్లో సెంచరీ మార్కు చేరుకోవడం విశేషం. ఈ సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.
తాజా సెంచరీతో టీ20ల్లో న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ కొట్టిన తొలి భారతీయుడుగా సూర్య రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో  రెండు సెంచరీలు సాధించిన రెండో  భారత బ్యాట్స్మన్ గా నిలిచాడు. 2018 లో రోహిత్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండుసెంచరీలు చేశాడు.
కివీస్ పై చేసిన సెంచరీతో  సూర్య అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక 50  ప్లస్‌ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్ రికార్డు నెలకొల్పాడు. 2022లో  సూర్యకుమార్ ఇప్పటి వరకు 11 సార్లు 50  ప్లస్‌ స్కోర్లు సాధించాడు.
ఇప్పటి వరకు ఈ రికార్డు  బాబర్‌ ఆజమ్ పేరిట ఉండేది. అతను ఈ ఏడాదిలో 10 సార్లు 50 ప్లస్ స్కోరు సాధించాడు. ఈ రికార్డును సూర్యకుమార్‌ బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. 2021లో రిజ్వాన్‌ 13 సార్లు 50  ప్లస్‌ స్కోర్లు సాధించాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసల వర్షం
సూర్యకుమార్ యాదవ్ కు న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య యాదవ్‌ ఆటతీరుకు  కేన్‌ విలియమ్సన్‌ ఫిదా అయ్యాడు. సూర్యకుమార్‌ స్టైల్‌, ఆటతీరును తాను గతంలో ఎప్పుడూ చూడలేదని, సూర్య ఇన్నింగ్స్ హైలెట్ అని చెప్పుకొచ్చాడు.  సూర్య కుమార్ వరల్డ్ లోనే అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. రెండో టీ20 ముగిసిన తర్వాత కేన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ పూర్తిగా భిన్నమైందని కేన్ విలియమ్సన్ తెలిపాడు. సూర్య సెంచరీ చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపాడు. అయితే తాము రెండో టీ20లో గెలిచేందుకు మరింత కృషి చేయాల్సిందని స్పష్టం చేసాడు.
“రెండో టీ20లో మా జట్టు మంచిగా ఆడలేదు. బౌలింగ్, బ్యాటింగ్ లో విఫలమయ్యాం. అయితే ఈ మ్యాచ్ లో సూర్య ఇన్నింగ్స్ హైలెట్. అతని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. సూర్య ఆడిన కొన్ని షాట్లు నేను ఇప్పటి వరకు చూడలేదు. సూర్య ఇన్నింగ్స్ చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. అతను అద్భుతంగా ఆడాడు”..అని కేన్ విలియమ్సన్ వివరించాడు. 
ఒక ఏడాదిలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన జ‌ట్టుగా భారత్ 
 
మరోవంక, ఒక ఏడాదిలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన జ‌ట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జ‌రిగిన రెండో టీ 20 మ్యాచ్‌తో ఈ సంవ‌త్స‌రం భార‌త జ‌ట్టు మొత్తం 62 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. దాంతో, ఒక ఏడాదిలో ఎక్కువ మ్యాచ్‌లు (వ‌న్డేలు, టెస్టులు, టీ 20 లు క‌లిపి) ఆడిన జ‌ట్టుగా టీమిండియా ప్ర‌పంచ రికార్డు సాధించింది.
ఇంత‌కుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా జ‌ట్టు పేరు మీద‌ ఉంది. ఆస్ట్రేలియా 2009లో 61 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌నకు ముందు 61 మ్యాచ్‌ల‌తో టీమిండియా, ఆస్ట్రేలియాతో స‌మంగా ఉంది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త జ‌ట్టు 39 టీ 2ం మ్యాచ్‌లు ఆడింది. అంతేకాదు, ఒక ఏడాదిలో అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా టీమిండియా గుర్తింపు సాధించింది. ఈ ఏడాది 62 మ్యాచ్‌లు ఆడిన భార‌త జ‌ట్టు 43 మ్యాచ్‌ల్లో విజేత‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భార‌త్ టెస్ట్‌ల్లో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది.
రోహిత్ నాయ‌క‌త్వంలో టీమిండియా స్వ‌దేశంలో వెస్డిండీస్, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికాతో జరిగిన వ‌న్డే, టీ 20 సిరీస్‌ల‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌నతో విజ‌యాలు సాధించింది. ఈ ఏడాది టీ 20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆరంభం నుంచి అద‌ర‌గొట్టిన టీమిండియా సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది.