నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా?

నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 30 ఏండ్లపాటు అడ్డుకున్న వ్యక్తితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని చెబుతూ ఏ నైతిక హక్కుతో గుజరాత్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఓట్లు అడుగుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రాబోయే రోజులలో గుజరాత్ కు కాంగ్రెస్ ఎంతటి నష్టం కలిగిస్తుందో ఇది తెలియచేస్తుందని అంటూ ఆయన రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. 
 
రాజ్‌‌‌‌కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌లో అధిక భాగానికి నర్మదా డామ్‌ ప్రాజెక్టు తాగునీరు, సాగు నీరు అందిస్తుందని, ఇలాంటి ప్రాజెక్టును మేథాపాట్కర్‌ మూడు దశాబ్ధాల పాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు. వారు గుజరాత్ ప్రతిష్టను మంటగరిపారని, ప్రపంచ బ్యాంకుతో సహా ఎవ్వరు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి వారితో కాంగ్రెస్ నేత చేతులు కలిపి పాదయాత్ర చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. 
 
‘‘చాలా మంది కారణంగా నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యమైంది. కచ్, కథియవాడ్ రీజియన్ల కరువును పోగొట్టేందుకు నర్మదా ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం. కానీ, నిన్న (శనివారం) నర్మదా వ్యతిరేక యూదమయకారిని (నర్మదా బచావ్ ఆందోళన్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్)తో కలిసి కాంగ్రెస్ నేత పాదయాత్ర చేశారు. సదరు మహిళ న్యాయ పరమైన ఎన్నో అడ్డంకులు సృష్టించి నర్మదా ప్రాజెక్టును దశాబ్దాలపాటు అడ్డుకున్నారు” అని ప్రధాని మోదీ  విమర్శించారు.
 
గుజరాత్‌‌‌‌ అభివృద్ధిపై ఎలాంటి రోడ్‌‌‌‌ మ్యాప్ లేని కాంగ్రెస్‌‌‌‌ కోసం ఓటును వృథా చేసుకోవద్దని ప్రజలను ప్రధాని కోరారు. ఆ పార్టీకి బదులుగా బీజేపీని గెలిపించాలని చెప్పారు. అమ్రేలీ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ సౌరాష్ట్ర రీజియన్ కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
 
‘‘కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని మీరు ఆశించలేరు. అభివృద్ధికి రోడ్‌‌‌‌మ్యాప్ ఏమిటని కాంగ్రెస్ నాయకులను మీరు అడగండి. వారి వద్ద ఎలాంటి ప్రణాళిక ఉండదు” అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో అమ్రేలీ జిల్లాలో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని, ఈ ఐదేండ్లలో వాళ్లు ఏం చేశారో చెప్పాలని మోదీ ప్రశ్నించారు. కనీసం ఒక్క పని అయినా చేశారా? అని అడిగారు.
 
గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు భారీగా తరలివచ్చి ఓటు వేయాలని, గత పోలింగ్ రికార్డులను బద్ధలు కొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ బూత్‌‌‌‌లలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. గుజరాత్‌‌‌‌లోని గిర్‌‌‌‌‌‌‌‌ సోమ్‌‌‌‌నాథ్ జిల్లాలో పర్యటించిన ఆయన వెరవల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 
 
అంతకుముందు సోమ్‌‌‌‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని మీడియా, పలు సర్వేలు ఇప్పటికే అంచనా వేశాయని, ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్‌‌‌‌ గత రికార్డులను చెరిపేస్తూ ఎక్కువ సీట్లు సాధిస్తారని తాను తరచూ వస్తున్నానని చెప్పారు. నరేంద్ర రికార్డులను భూపేంద్ర బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
 
గుజరాత్‌‌‌‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం కష్టపడాలని పేర్కొంటూ ప్రజలు తమ దీవెనలు అందిస్తారని భావిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు మొత్తం ఉత్తర భారతదేశం నుంచి సరుకులు మన ఓడరేవుల ద్వారా ప్రపంచానికి సరఫరా అవుతున్నాయని, ఈ ఓడరేవులు భారత్ శ్రేయస్సుకు మార్గాలుగా మారాయని ప్రధాని చెప్పారు.