సిట్ నోటీసులపై హైకోర్టులో బీజేపీ లంచ్‌మోషన్ పిటిషన్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ లకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.
 
బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌ల నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో ఎనిమిది మందిని పిటిషనర్ ప్రతివాదులు చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సైబారాబాద్ పోలీస్ కమిషనర్, ఏసీపీ రాజేంద్రనగర్, సీహెచ్‌వో మోహినాబాద్, సెంట్రల్ హోమ్ ఎఫైర్స్, సీబీఐ,  రోహిత్ రెడ్డిలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. 
 
దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారికి సిట్ అక్రమ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసుకు సంబంధం లేని వారికి నోటీసులిచ్చి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, సిట్ నోటీసులపై స్టే విధించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.
 
కాగా, బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి సమర్పించిన ఈ మధ్యంతర పిటిషన్‌తో బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు జారీ అయిన విషయం బయటపడింది. ఈ నెల 21వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా బీఎల్‌ సంతోష్‌ను సిట్‌ తన నోటీసులో కోరినట్టు బీజేపీ నేత తన మధ్యంతర పిటిషన్‌లో పేర్కొన్నారు.