బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మర్రి శశిధర్ రెడ్డితో పాటు బండి సంజయ్, డీకే అరుణ కూడా అమిత్ షాతో భేటీ ఆయ్యారు. శశిధర్ రెడ్డి పార్టీలో చేరికపై నేతలు అమిత్ షాతో చర్చించారు.

అయితే హైదరాబాద్ వెళ్లి కార్యకర్తలతో మాట్లాడి మంచి రోజు పార్టీలో చేరుతానని శశిధర్ రెడ్డి అన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల్లో మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోత్తులో భాగంగా ఆయన టిక్కెట్ కోల్పోయారు.

కాగా, అమిత్ షాతో భేటీ సందర్భంగా ఎంపీ అరవింద్ నివాసంపై జరిగిన దాడి గురించి బండి సంజయ్ వివరించారు. అమిత్ షా వెంటనే ఫోన్ లో అరవింద్‌తో మాట్లాడి దాడి గురించి తెలుసుకున్నారు. కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో శశిధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఆయన పార్టీ మారబోతున్నారనే దిశగా సంకేతాలను ఇస్తున్నట్టుగా ఉన్నాయి. 

రేవంత్ రెడ్డిపై ఇటీవల శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కల్లోలానికి రేవంత్ కారణమని, కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా ఆయన చేస్తున్న పనులు ఉన్నాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్ రేవంత్ కు ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని విమర్శించారు.