అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ గూండాల దాడి పిరికిపంద చర్య

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ గూండాల దాడి పిరికిపంద చర్య అని పేర్కొంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారు తీవ్రంగా ఖండించారు. అధికార టీఆర్ఎస్ నేరపూరిత చర్యలతో భయానక వాతావవరణం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   దాడులకు తెగబడ్డ వారిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
 
 ప్రజల్లో బిజెపి కి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర భయాందోళనలకు గురైందని, అందుకే రాజ్యాంగ విరుద్ధంగా, హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు.  టీఆర్ఎస్ అగ్రనేతల సూచనలు, ఆదేశాలు, పథక రచనతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. 
 
బిజెపి నేతలను బెదిరించే రూపకపల్పనలో భాగంగానే టీఆర్ఎస్ ముందస్తు దాడికి దిగిందని చెబుతూ టీఆర్ఎస్ సర్కారులోని అగ్ర నాయకత్వం అండతో ఆ పార్టీ గూండాలు పదేపదే హింసాత్మక ధోరణితో హత్యాకాండకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం అప్రజాస్వామికం అంటూ ఈ ఘటనలో పోలీసుల పాత్ర ఉందనడానికి ఇదొక సాక్ష్యం అని స్పష్టం చేశారు.
 
ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లోనూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో గూండాలు కర్రలు, రాళ్లతో దాడులు, దౌర్జన్యానికి తెగబడ్డారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో క్రమేణా టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుండటంతో పాటు బిజెపిపై ప్రజాధరణ పెరుగుతుండటంతో టీఆర్ఎస్ నేతలు నైరాశ్యం, తీవ్ర అసహనానికి లోనై అప్రజాస్వామికంగా బిజెపి నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
ఈ హింసాత్మక చర్యలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో చులకన భావం నెలకొందని కేసీఆర్ సర్కారు దుష్పరిపాలన, అవినీతిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న తెలంగాణ ప్రజలు సరైన అవకాశం కోసం వేచిచూస్తున్నారని ఆయన చెప్పారు.
 
 కల్వకుంట్ల కుటుంబ పాలనను బంగాళాఖాతంలో పడేసి, టీఆర్ఎస్ ను రాజకీయంగా సమాధి చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.  అర్వింద్ ఇంటిపై అనాగరికంగా, భౌతిక దాడులకు తెగబడిన టీఆర్ఎస్ గూండాలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  అర్వింద్ పై తీవ్ర వ్యాఖ్యలతో దూషించడమే కాకుండా హత్య చేస్తామంటూ బెదిరించినందుకు ఎమ్మెల్సీ శ్రీమతి కవితపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. 
 
నిఘా విభాగం ఎక్కడుంది?
 
కాగా,  వందలాదిమంది టిఆర్ఎస్ నేతలు గూండా ల్లాగా ధర్మపురి అరవింద్ ఒక పార్లమెంటు సభ్యుడు ఇంటిపై దాడి చేస్తుంటే నిఘా విభాగం ఎక్కడున్నదని బీజేపీ.ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు,  పార్లమెంటరీ పార్టీ బోర్డ్ సభ్యులు డా. కె లక్ష్మణ్ ప్రశ్నించారు.  
 
ప్రతిపక్ష పార్టీల నేతల ఇంటిదగ్గర అదేవిధంగా పార్టీ ఆఫీసుల ముందు ముందస్తుగా పోలీసులను పెట్టడం గృహనిర్బంధాలు చేయడం టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్నదే అంటూ మండిపడ్డారు. 
ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంటిపైన దాడి చేస్తే టిఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు దాడులను ఖండించకపోవడం పరోక్షంగా ఒప్పుకున్నాట్లే అని స్పష్టం చేశారు. 
కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నందునే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి దిగారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. టీఆర్ఎస్ నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని,  ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దిల్‌‌సుఖ్ నగర్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితను ఆమె కుటుంబ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నామని, అవినీతికి పాల్పడే వాళ్లు మాకెందుకని ప్రశ్నించారు.