అర్వింద్ ఇంటిపై దాడి.. డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి, ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి, ధ్వంసం చేయడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తమిళిసై పేర్కొన్నారు. ఎంపీ నివాసంలో కుటుంబ సభ్యులను, ఇంటి పనిమనిషిని బెదిరించడం, భయపెట్టడం స‌బ‌బు కాద‌ని, ప్రాధాన్యతా ప్రాతిపదికన డీజీపీ నుంచి నివేదిక కోరామని ఆమె తెలిపారు.

ఇలా ఉండగా, ఒక ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే రక్షణ కల్పించకుండా  డీజీపీ ఏం చేస్తున్నారని అరవింద్  నిలదీశారు. గతంలో కూడా ఎంపీలపై దాడులు జరిగాయని.. తనపై దాడి జరగడం కొత్తేం కాదని చెప్పారు. ఎంపీలపై ఎన్నోసార్లు దాడులు జరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. 

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్, ఇంటి పనిమనిషిపై దాడి చేసినట్లు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూలకుండీలు, దేవుడి ఫొటోలు ధ్వంసం చేసినట్లు ఆమె చెప్పారు. 

రాష్ట్రాన్ని నిజాం రాజ్యంలా మార్చారు 
రాష్ట్రాన్ని నిజాం రాజ్యంలా మార్చారని, అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ పార్టీ గూండాల దాడి హేయమైన చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ గూండాయిజానికి, రౌడీయిజానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. అర్వింద్‌‌తో కలిసి ఆయన ఇంటిని కిషన్ రెడ్డి పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిరాశ, నిస్పృహలతోనే టీఆర్ఎస్ దాడులు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ‘‘రాజకీయ విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకోవచ్చు.. అందులో తప్పు లేదు.. ముఖ్యమంత్రి కుమారుడు ప్రధాని మోడీని ఎన్నో మాటలు అన్నాడు.. కానీ ప్రధాని ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదు” అని గుర్తు చేశారు.
 
తెలంగాణాలో  ఏక్ నాథ్ షిండేలు అవసరం లేదని స్పష్టం చేస్తూ  కొంతమంది ఎమ్మెల్యేలను కావాలని మా పార్టీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు . కేసీఆర్ కూతురును, కల్వకుంట్ల కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచనే తమకు  లేదని తేల్చి చెప్పారు. 
 
అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్న వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని.. అలాంటి ఆయన ఫిరాయింపులు, నైతిక విలువల గురించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఫిరాయింపులపై కేసు పెట్టాల్సి వస్తే ముందు కేసీఆర్ పైనే పెట్టాలని డిమాండ్ చేశారు.
కవితపై అర్వింద్ ఫిర్యాదు
కాగా, బంజారాహిల్స్ పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫిర్యాదు చేశారు. కొట్టి కొట్టి చంపుతామంటూ కవిత వ్యాఖ్యలు చేశారని, ఆ వెంటనే 50 మంది టీఆర్ఎస్ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులని ఉసిగొల్పి కవితే తన ఇంటిపైకి దాడికి పంపించారని, తన ఇంటిపై దాడి ఘటనలో కల్వకుంట్ల కవిత హస్తం ఉందని ఆరోపించారు.
అర్వింద్‌‌ ఇంటిపై దాడి చేసిన పలువురు టీఆర్‌‌ఎస్‌‌ నాయకులపై బంజారాహిల్స్‌‌ పోలీసులు నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసులు నమోదు చేశారు. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌‌లు పరిశీలిస్తున్నామని, దాడిలో పాల్గొన్న నేతలపై 148, 452, 354, 323 రెడ్‌‌విత్‌‌149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎవరెవరిపై ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టామనే వివరాలు త్వరలో చెబుతామన్నారు.

రాష్ట్ర వ్యాప్త నిరసనలు 

 ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు, వివిధ మోర్చాల నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలను తిప్పి కొట్టాలని, నిరసనలు కొనసాగించాలని వారికి సూచించారు. 

సీఎం కేసీఆర్ నియంత పాలనను నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఎంపీ అర్వింద్ తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు బంజారాహిల్స్‌‌లోని కమాండ్ కంట్రోల్ ఆఫీసుకు వెళ్లారు.

ఎంపీ అర్వింద్‌‌ ఇంటిపై దాడికి తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌‌ సీపీ సీవీ ఆనంద్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే డీజీపీని కలుస్తామని, ఆయన కూడా స్పందించకుంటే హైకోర్టు ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు.