ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం చాలా ప్రమాదకరం

ఉగ్రవాదం నిస్సందేహంగా, ప్రపంచ శాంతి భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు అని, కానీ, ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం చాలా ప్రమాదకరమని, ఉగ్రవాదం ‘మార్గాలు,  పద్ధతులు’ అటువంటి నిధుల నుండి వ్యాపిస్తాయని, ఇంకా, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హెచ్చరించారు.
‘టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ టెర్రరిజం లో గ్లోబల్ ట్రెండ్స్’ అనే అంశంపై ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న ‘నో మనీ ఫర్ టెర్రర్’ మినిస్టీరియల్ కాన్ఫరెన్ కు అధ్యక్షత వహిస్తూ భారత భద్రతా దళాలు, పౌరులు తీవ్రమైన ఉగ్రవాద హింసా ఘటనలను సుస్థిర మైన, సమన్వయమైన రీతిలో ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలలో ఖండించాలని అంతర్జాతీయ సమాజం ఒక సమిష్టి విధానాన్ని కలిగి ఉందని, కానీ, సాంకేతిక విప్లవం కారణంగా ఉగ్రవాదం రూపాలు,  వ్యక్తీకరణలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు.  ప్రస్తుతం ఉగ్రవాదులు, ఉగ్రవాద బృందాలు అత్యాధునిక ఆయుధాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మ నైపుణ్యాలను, సైబర్, ఆర్థిక రంగానికి సంబంధించిన మెళకువలను బాగా అర్థం చేసుకున్నాయని, వాటిని ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు.
ఉగ్రవాదం డైనమైట్‌ నుంచి మెటావర్స్‌గా, ఏకే-47 నుంచి వర్చువల్‌ అసెట్స్‌గా మారడం కచ్చితంగా ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశమని, దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు మనమందరం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.  తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి ఉగ్రవాదులు ‘డార్క్ నెట్’ను ఉపయోగిస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు.
అదనంగా, క్రిప్టోకరెన్సీ వంటి వర్చువల్ ఆస్తుల వినియోగం పెరిగింది. ఈ డార్క్ నెట్ కార్యకలాపాల నమూనాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని,  వాటి పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని అమిత్ షా పిలుపిచ్చారు. దురదృష్టవశాత్తు, ఉగ్రవాదంపై పోరాడాలనే మన సమిష్టి సంకల్పాన్ని బలహీనపరచడానికి లేదా అడ్డుకోవడానికి ప్రయత్నించే దేశాలు ఉన్నాయని కేంద్ర హోం మంత్రి హెచ్చరించారు.
కొన్ని దేశాలు ఉగ్రవాదిలకు రక్షణ కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం మనం చూశామని చెబుతూ, ఉగ్రవాదిని రక్షించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని ఆయన స్పష్టం చేశారు. అటువంటి శక్తులు తమ ఉద్దేశ్యాలలో ఎన్నడూ విజయం సాధించకుండా చూడటం మన సమిష్టి బాధ్యత అని ఆయన హోమ్ మంత్రి చెప్పారు. 2021 ఆగస్టు తరువాత దక్షిణాసియా ప్రాంతంలో పరిస్థితి మారిందని చెబుతూ పాలన లో మార్పు, అల్ ఖైదా, ఐసిస్ ల ప్రభావం ప్రాంతీయ భద్రతకు ఒక గణనీయ సవాలుగా నిలుస్తున్నాయని అమిత్ షా తెలిపారు. 

ఈ కొత్త సమీకరణాలు ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం (టెర్రర్ ఫైనాన్సింగ్) సమస్యను మరింత తీవ్రతరం చేశాయని ఆయన పేర్కొన్నారు. అల్ ఖైదాతో పాటు, దక్షిణాసియాలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూనే ఉన్నాయని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల సురక్షిత స్వర్గధామాలను లేదా వారి వనరులను మనం ఎన్నడూ విస్మరించరాదని అమిత్ షా స్పష్టం చేశారు.