కాంగ్రెస్ నుంచి మ‌ర్రి శ‌శధ‌ర్ రెడ్డి బ‌హిష్క‌ర‌ణ

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఫై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంతో .ఆయనపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.  
 
ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ బహిష్కరణ వేటు వేశారు.  శశిధర్‌రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిజెపి నేతలు బండి సంజయ్, డికె. అరుణతో కలిసి శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి అమిత్‌షాతో శశిధర్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరే విషయంపై చర్చించినట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన పలువురు బిజెపి నేతలతో సంప్రదింపులు జరిపారు.
 
మరోవైపు కొంత కాలంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని పేర్కొంటూ  అది నయం చేయలేని స్థితికి చేరుకుందని తెలిపారు. 
 
ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదని అంటూ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని, మునుగోడు ఉప ఎన్నికల్లో తాను రూ. 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. 
 
ఇన్చార్జులతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశాడని ఆరోపించారు.  ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించాడని కీలక ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవoత్ అందుబాటులో ఉండడని,  చెంచా గాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని మండిపడ్డారు.