పోలీసులు కనుసన్నలోనే ఎంపీ అర్వింద్‌ నివాసంపై దాడి

పోలీసులు కనుసన్నలోనే ఎంపీ అర్వింద్‌ నివాసంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం పెరిగిపోయిందని, అందుకే అకారణంగా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. 
బంజారాహిల్స్‌లోని  అర్వింద్‌ నివాసానికి శనివారం వచ్చిన ఆయన. దాడి జరిగిన తీరు గుర్తించి అడిగి తెలుసుకున్నారు.
అర్వింద్‌ తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అర్వింద్‌ ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్‌ చేసిన విషయం పోలీసులకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.  ఇంట్లోని ఫర్నిచర్‌ను పగులకొట్టినందుకు అర్వింద్‌ తల్లి బాధపడడం లేదని నిత్యం పూజించుకునే దేవతామూర్తుల ఫొటోలను, తులసి కోటను కింద పడేయడం పట్ల మానసికంగా కుంగిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అసలైన హిందూ వాది అని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ తన పార్టీ శ్రేణులు చేసిన పనికి ఎందుకు నోరు విప్పడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. 
 
 రాజకీయాల్లో దాడి సంస్కృతిని ఏ పార్టీ కూడా ప్రోత్సహించొద్దని సంజయ్ హితవు చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని కుటుంబసభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, ఖాకీ ముసుగులో గులాబీ చొక్కా లేసుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. 
 
దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నిందితులకు శిక్ష పడేలా చూడాలని, దాడి సమయంలో ఉన్న పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఆట మొదలు పెట్టిందని, ఎండింగ్‌ కూడా తామే పూర్తి చేసి కేసీఆర్‌ కుటుంబానికి షాక్‌ ఇస్తామని ఆయన  చేశారు. 
 
టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. అర్వింద్‌ నివాసానికి వచ్చిన ఆయన దాడి గురించి ఆరా తీశారు. విమర్శలు చేస్తే కుటుంబ సభ్యులు ఉంటున్న ఇళ్లపై దాడులు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. 
దాడిపై పిటిషన్‌ వేస్తా: అర్వింద్‌
దాడి వెనుక పోలీసుల హస్తం ఉందని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. తన నివాసం ఎదురుగా టీఆర్‌ఎస్‌ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు ఇద్దరు కానిస్టేబుళ్ల ను పంపించి చేతులు దులుపుకొన్నారన్నారని గుర్తు చేశారు. బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇంటి మీద రాళ్లు వేసి ఉండే వారు కాదని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే నమ్మకం కూడా లేదని పేర్కొంటూ  త్వరలోనే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు చెప్పారు.