త్వరలోనే కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ముగింపు

కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసే సమయం దగ్గర్లోనే ఉందని కేంద్ర బొగ్గు, గనుల, పార్లమెంటరి వ్యవహారాల శాఖా మంత్రిప్రహ్లాద జోషి జోస్యం చెప్పారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తుందని, టీఆర్.ఎస్ ను ప్రజలు పూర్తిగా మరిచిపోయారని, కేసీఆర్ కుటుంబ పాలనాలపై ప్రజలకు విశ్వాసం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని  ప్రహ్లద జోషి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబ పాలనపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.
 
 సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండేదని, ఇప్పుడు దాన్ని అందరూ మరిచిపోయారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. 
 
ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రహ్లాద్ జోషి చెప్పారు. కేసీఆర్ సాగిస్తున్న అవినీతి, అబద్ధాలతో కూడిన కుటుంబ పాలనను నిర్మూలించేందుకు పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. 
సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2015లో తెలంగాణకు మూడు బొగ్గు బావులను కేటాయిస్తే రెండు బావులను తిరిగి ఇచ్చారని తెలిపారు. తాము సింగరేణి లాభదాయంగా ఉండాలని పారదర్శకంగా గ్లోబర్ టెండర్ విధానాన్ని అవలంభిస్తూ గనులను లీజుకు ఇస్తుంటే, కేసీఆర్ మాత్రం తన బినామీలకు నామినేషన్ పద్ధతిలో గనులను కేటాయిస్తున్నారని ఆరోపించారు. 
సింగరేణిలో కేంద్ర వాటా కంటే రాష్ట్ర వాటానే ఎక్కువని, అందుకే ఏ నిర్ణయం తీసుకోవాలన్న రాష్ట్రమే తీసుకోవాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
అబద్దాలతో ప్రజలను నమ్మించాలని కేసీఆర్ చూస్తున్నారని పేర్కొంటూ అబద్దాల కంపెనీని తయారు చేసిన కేసీఆర్ ఇకపై అబద్దాలు  చెప్పడం మానుకోవాలని హితవు చెప్పారు.
 ‘‘తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ అబద్ధాల కంపెనీ నడుపుతూ, నిత్యం అబద్ధాలను సృష్టిస్తున్నరు. ఎప్పుడూ అబద్ధాలాడే వాళ్లను జూటా రావులని పిలవాలి” అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, జిట్టా బాలక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.