పూరీ, చార్మిలపై ఇడి ప్రశ్నల వర్షం

లైగర్‌ వివాదాలు ప్రముఖ సినీదర్శకుడు పూరి జగన్నాధ్‌ను చుట్టుముట్టి వదలడం లేదు. ఈ సినిమా నిర్మాణంలో రాజకీయ నేతల బ్లాక్‌ మనీ పెట్టుబడిగా పెట్టారని, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులు అందడంతో వారం క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్శక నిర్మాత పూరి జగన్నాధ్‌కు, నిర్మాణ భాగస్వామి ఛార్మికి నోటీసులు జారీచేసింది. 
 
గురువారం ఉదయం 8 గంటలకే ఈడీ ఆఫీసుకు వెళ్ళగా, 13 గంటలకు పైగా విచారణ కొనసాగింది. ప్రధానంగా విదేశీ పెట్టుబడులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారుల వివరాలపై విచారణ జరిపినట్లు సమాచారం. ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానర్‌పై దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మిలు నిర్మించారు.
 
విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు ఫిర్యాదులు అందగా, నోటీసు జారీచేసిన అధికారులు గురువారం విచారణ నిర్వహించారు. విచారణ సుదీర్ఘంగా సాగడంతో.. ఉత్కంఠ నెలకొంది. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులపై విచారణ జరిపారు.
 
ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, చార్మిలను ఇడి విచారించిన విషయం విదితమే. అయితే ఆ కేసులో పూరి జగన్నాథ్, చార్మిలతో పాటు ఇతరులకు కూడా ఇడి క్లీన్ చిట్‌ను ఇచ్చింది. అయితే.. తాజాగా పరిణామాలలో ఇడి విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.