అరవింద్ ఇంటి ఫై దాడి.. కొట్టి చంపుతా అంటూ కవిత హెచ్చరిక 

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తులు విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలకు చేశారంటూ రెచ్చిపోయారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. 
 
ఆయన ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వంసం చేశారు. ఇంట్లో నానా బీభత్సం చేశారు. టీఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేస్తున్న సమయంలో అరవింద్ ఇంట్లో లేరు.  నిజామాబాద్లో ఉన్నారు.
 
మరోవంక, ఇంకోసారి తనపై అర్వింద్ నోరుపారేసుకుంటే ఊరుకోమని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే నిజామాబాద్ సెంటర్ లో చెప్పుతో కొడతానంటూ అని కవిత హెచ్చరించారు. ‘‘నేను కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నానని కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట.. అరవింద్ ఎందుకు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు’’ అని కవిత ప్రశ్నించారు.  “నేను కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్‌ చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు” అంటూ ఎదురు దాడికి దిగారు. 
 
“నా పుట్టుక, బతుకు తెలంగాణ. నేను ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదు. అర్వింద్‌ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. నోటికొచ్చినట్లు మాట్లాడితే మెత్తగా తంతాం. నోరు అదుపులో పెట్టుకోకుంటే అర్వింద్‌ను తరిమికొడతాం. కొట్టి చంపుతం బిడ్డ.. రాజకీయం చెయ్‌.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
 
నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చి రైతులను అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు. బాండ్ పేపర్ రాసిచ్చి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైనందుకు రేపటి నుంచి పోలీస్ స్టేషన్ లలో రైతులు ఆయనపై చీటింగ్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అర్వింద్ క్వాలిఫికేషన్పైన కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
 
“అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా.. వెంటబడి ఓడిస్తా. పసుపుబోర్డ్‌ తేలేని అర్వింద్‌… రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. బాధతో మాట్లాడుతున్నాను.. ప్రజలు తప్పుగా భావిస్తే క్షమించాలి’’ అని కవిత  పేర్కొన్నారు.

అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడి సిగ్గుచేటు

కాగా, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని ఆమె పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు కేవలం ధర్నాకు సిద్ధమైతేనే అరెస్ట్ చేసి కేసులు నమోదుచేసే పోలీసులు మరి ఇప్పుడేం కేసులు బుక్ చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఈ దాడికి ప్రధాన కారకురాలైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదుచేయాలని అరుణ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం దీనికి సంకేతమని ఆమె తెలిపారు. 
టీఆర్ఎస్ కు ప్ర‌జా స్వామ్యాన్ని ఎదుర్కొనే ద‌మ్ము లేక ఆ పార్టీ నాయ‌కులు భౌతిక దాడుల‌కు దిగుతున్నార‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజ‌య్ మండిప‌డ్డారు. ఎంపీ అర‌వింద్ ఇంటిపై దాడిని బండి సంజ‌య్ తీవ్రంగా ఖండించారు. అర‌వింద్ కి ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు. 
 
బీజేపీ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ద‌మ్ములేని ద‌ద్ద‌మ్మ‌లు టీఆర్ ఎస్ నేత‌లు అంటూ తెలంగాణ‌లో ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కేయాల‌ని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గ‌డీల గూండాల దాడుల‌కు బ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని స్పష్టం చేశారు. 
ఇలా ఉండగా, సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ వచ్చారని అరవింద్ గురువారం  విమర్శలు గుప్పించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ స్వయంగా అంధకారంలోకి నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. పవర్ సెక్టార్‌ను గాలికొదిలేసి పాలకులు గంజా, డ్రగ్స్ పార్టీల్లో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. 

బిడ్డ బ్యూటీ పార్లర్ మీద సంపాదించిన డబ్బుతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు కేసీఆర్ ఫీలవుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు లిక్కర్ స్కాం పార్టనర్స్ అని ఆరోపించారు.

కవిత ను కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని చెబుతూ  అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చే కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందలేదని, దీంతో కవిత అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసిందని అర్వింద్ ఆరోపించారు. 

ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కవితను తన వెంటే తోడ్కొని యూపీకి వెళ్లారని తెలిపారు. తన కూతురు తన వెంటే ఉందని చెప్పేందుకు కేసీఆర్‌ను ఆమెను యూపీకి తీసుకెళ్లారని చెప్పారు. 

కవితను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని అరవింద్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటంబం భ్రష్టుపట్టించదని ఆయన మండిపడ్డారు. అసలు కవితను బీజేపీలో చేర్చుకునేందుకు ఎవరు ప్రయత్నించారో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.