కవిత కులాహంకారంతో మాట్లాడుతోందని అరవింద్ ఆగ్రహం 

 కేసీఆర్, కేటీఆర్, కవితల ఆదేశాల మేర‌కు హైదరాబాద్‌లోని తన ఇంటిపై దాడి జ‌రిగిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ గుండాలు ఇంట్లో వస్తువులు పగలగొడుతూ,  బీభత్సం సృష్టిస్తూ, తన అమ్మను బెదిరించారని అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు, ఈ ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

తనపై కవిత చేసిన వ్యాఖ్యల ఫై మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కులాహంకారంతో మాట్లాడుతోందని, కేసీఆర్, కేటీఆర్, కవితలకు విపరీతంగా కులాహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. తన ఇంట్లో విధ్వంసం సృష్టించి 70 ఏండ్ల తల్లిని బెదిరించి ఇతర మహిళలను కొట్టే హక్కు ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 

కవిత ఇష్టానుసారం వ్యవహరించేందుకు ఇది దొరల పాలన కాదని స్పష్టం చేశారు. రాజకీయ జీవితం చివరి దశకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన చెందుతున్నారని, దాన్ని తాను అర్థం చేసుకుంటానని పేర్కొన్నారు. తనపై ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్న ఆమె ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 

కవిత తన అభ్యర్థనను మన్నించడం ఎంతో సంతోషంగా ఉందన్న అర్వింద్ ఇప్పటికైనా ఆమె మాటపై నిలబడాలని ఆకాంక్షించారు. 2024 లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. ‘మీ అయ్య మాట్లాడినట్టు నేను మాట్లాడను’ అంటూ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు. తామేమైనా కేసీఅర్ మీద దాడి చేశామా? అని ప్రశ్నించారు. ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్ చేయడం నిజమా కాదా? అనేది దర్యాప్తు జరపాలని సూచించారు. 

 అందరి కాల్స్ ట్యాప్ చేస్తారు కాబట్టి కవిత కాల్స్ కూడా ట్యాప్ చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. తన తల్లి ఇంట్లో ఉండగా భయపెట్టించేలా.. దేవుడి పటాలు, కారు అద్దాలు పగలగొట్టారని తెలిపారు. ప్రగతి భవన్ మీద ఎప్పుడైనా దాడి చేశానా? అని అర్వింద్ ప్రశ్నించారు.

‘‘నా తల్లి గారిని భయపెట్టించే హక్కు ఎవరిచ్చారు? విపరీతమైన కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్, కవిత, కేటీఆర్‌లకు విపరీతమైన కులాహంకారం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నిలబడతా.. దమ్ముంటే నాపై పోటీ చేయి. మీ అయ్య మాట్లాడినట్టు నేను మాట్లాడాను. నా మీద పోటీ చేయడానికి ఆహ్వానిస్తున్నా. దాడులు చేస్తే భయపడేది లేదు’’ అని సవాల్ చేశారు.