రాజకీయ ఒత్తిళ్లతో కొవాగ్జిన్‌ టీకాకు ఆమోదం అంటూ దుమారం

స్వదేశీ కరోనా టీకాల తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాలకు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా హడావిడిగా ఆమోదం ఇచ్చారని, “నిర్ధిష్ట ప్రక్రియలను దాటవేశారని”, క్లినికల్ ట్రయల్స్‌ను “వేగవంతం” చేశారని వార్త కథనాలు వచ్చాయి. 

కోవాక్సిన్‌ను తయారు చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ట్రయల్స్‌కు సంబంధించిన నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించలేదని ‘లాన్సెట్‌’ ఓ కధనాన్ని ప్రచురించడం, దాని ఆధారంగా జంతువుల మీద తప్ప మనుషుల మీద పూర్తి స్థాయిలో కోవాక్సిన్‌ను పరిశీలించలేదని  వైద్య విషయాల ప్రచురణ సంస్థ స్టాట్‌ పేరొనడం, వీటి ఆధారంగా ‘ది వైర్‌’ ప్రచురించిన తాజా కథనం దుమారాన్ని రేపింది.
టీకాల కోసం నిర్వహించిన మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌లో చాలా అక్రమాలు జరిగాయని ఆ కథనాలు పేర్కొన్నాయి. అలాంటి వార్త కథనాలు పూర్తిగా తప్పు. వాటిలో ఉన్నది అవాస్తవ సమాచారం అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.  అత్యవసర వినియోగ అధికారం కోసం కరోనా9 టీకాలను ఆమోదించేందుకు భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ అయిన సీడీఎస్‌సీవో ఒక శాస్త్రీయ విధానాన్ని, నిర్దేశించిన నిబంధనలను పాటించాయని తేల్చి చెప్పాయి. 
ప్రభుత్వ వర్గాల కధనం ప్రకారం, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు (సీడీఎస్‌సీవో) చెందిన సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) 2021 జనవరి 1, 2 తేదీల్లో సమావేశమైంది. సరైన చర్చల తర్వాత, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకాను పరిమిత అత్యవసర వినియోగానికి ఆమోదించవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. 
పరిమిత అత్యవసర ఉపయోగం కోసం కొవాగ్జిన్‌కు 2021 జనవరిలో ఆమోదం లభించింది. దీనికంటే ముందు, టీకా భద్రత, రోగ నిరోధక శక్తికి సంబంధించిన సమాచారాన్ని నిపుణుల కమిటీ సమీక్షించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. 
భారత్ బయోటెక్ అందించిన శాస్త్రీయ సమాచారం, ఇప్పటివరకు ఆ సంస్థ చేపట్టిన చర్యల ఆధారంగా ప్రతిపాదిత మోతాదు ప్రకారం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభించడానికి నిపుణుల బృందం ఆమోదించింది. సీడీఎస్‌సీవోకు భారత్ బయోటెక్ సమాచారం సమర్పించిన తర్వాత, సీడీఎస్‌సీవోలో నిర్ధిష్ట ప్రక్రియకు అనుగుణంగా, డీజీసీఐ ఆమోదంతో వార్త కథనాల్లో పేర్కొన్న ‘అశాస్త్రీయ మార్పులు’ జరిగాయి.

భారత్ బయోటెక్ సమర్పించిన తదుపరి సమాచార నివేదిక; టీకా సమర్థత & భద్రతకు సంబంధించి మధ్యంతర సమాచారంపై నిపుణుల కమిటీ అంచనా ఆధారంగా, ‘క్లినికల్ ట్రయల్ మోడ్’లో కరోనా టీకా నిర్వహణ షరతును 2021 మార్చి 11న తొలగించారు.

సీడీఎస్‌సీవో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే కొవాగ్జిన్‌ సహా కరోనా టీకాలకు జాతీయ నియంత్రణ సంస్థ ద్వారా అనుమతి మంజూరు అవుతుంది. టీకాల అత్యవసర వినియోగానికి వివిధ షరతులు, పరిమితులతో ఈ ఆమోదం లభిస్తుంది.   పల్మనాలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన రంగాలకు చెందిన నిపుణులు సీడీఎస్‌సీవో నిపుణుల బృందంలో ఉంటారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. 

కథనాలను ఖండించిన భారత్ బయోటెక్
మరోవంక, భారత్ బయోటెక్ సహితం ఈ కథనాలను ఖండించింది.  కోవాక్సిన్ కు సంబంధించిన రోగనిరోధక ప్రతిస్పందన  డేటా 2020, 2021 నాటికి అనేక ప్రసిద్ధ అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమైన్నట్లు గుర్తు చేసింది. బూస్టర్ డోస్‌లపై డేటా అధికారులకు సమర్పించిన్నట్లు తెలిపింది.

ఇటువంటి మీడియా అవుట్‌లెట్‌ల ద్వారా కొంతకాలంగా తమ టీకాకు, కంపెనీకి వ్యతిరేకంగా తప్పుడు వాదనలు, సమాచారాలతో ప్రకటనలు, ప్రచురణలు జరుపుతూ వస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అటువంటి తప్పుడు ప్రచురణలకు స్పందిస్తూ మీడియా సంస్థలు తమ రిపోర్టింగ్‌లో బాధ్యతాయుతంగా ఉండాలని కోరింది.  ఔషధం, సైన్స్, వ్యాక్సిన్‌లు, ఫార్మాస్యూటికల్స్‌పై వార్తా కథనాలు, ఇతర అంశాలతో పాటు, సైద్ధాంతిక, రాజకీయ లేదా ఆర్థిక విషయాలపై, పక్షపాత ధోరణితో  కాకుండా వాస్తవ శాస్త్రీయ వాస్తవాలు, డేటాపై ఆధారపడి ఉండాలని హితవు చెప్పింది.