వాతావరణ మార్పులలో సంపన్న దేశాలపై మండిపడ్డ భారత్ 

వాతావరణ మార్పులను కట్టడి చేయడంలో సంపన్న దేశాలు అనుసరిస్తున్న విధానాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం కోసం ఉద్గారాలను తీవ్రంగా తగ్గించాలని అభివృద్ధి చెందిన దేశాలు చెప్తున్నాయని, అయితే దీని కోసం ప్రధాన ఉద్గార దేశాలు, అత్యధిక ఉద్గార దేశాలు అనే పదాలను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. 
 
వాతావరణ మార్పులకు చారిత్రక బాధ్యత సంపన్న దేశాలదేనని తెలిపింది. ఐక్య రాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు  నవంబరు 6 నుంచి ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జరుగుతోంది. ఈ నెల 18తో ఈ సమావేశాలు ముగుస్తాయి. సంపన్న దేశాలు ఈ సమావేశం కవర్ టెక్స్ట్‌లో ‘‘మేజర్ ఎమిటర్స్’’, ‘‘టాప్ ఎమిటర్స్’’ అనే పదాలను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. టాప్ 20 ఎమిటర్స్‌లో భారత్, చైనా ఉన్నాయి. 
 
అయితే అభివృద్ధి చెందిన దేశాల వాదన ఏమిటంటే, కేవలం తాము మాత్రమే కాకుండా టాప్ ఎమిటర్స్ కూడా ఉద్గారాలను అత్యధిక స్థాయిలో తగ్గించుకోవాలని చెప్తున్నాయి. ఈ వాదనను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ విషయాన్ని ఈ సమావేశాలకు హాజరైన భారత బృందంలోని ఓ సభ్యుడు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఈ కవర్ టెక్స్ట్‌కు తుది రూపం ఇచ్చేందుకు సభ్య దేశాల మంత్రులు, నెగొషియేటర్లు చర్చలు జరుపుతున్నారు. 
 
ఈ సమావేశాలు శుక్రవారంతో ముగియనుండటంతో దీనిపై ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ చర్చల వివరాలను ఓ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. ఐరాస వాతావరణ మార్పుల సదస్సులో కీలకాంశాలపై పురోగతి కనిపించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. వాతావరణ సమస్యల విషయంలో కొన్ని ప్రాథమిక వైఖరుల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. 
 
ఉద్గారాలను తగ్గించడానికి అమలు చేయవలసిన కార్యక్రమాలు, రెండో పీరియాడిక్ సమీక్ష, ఉద్గారాల కట్టడి చర్యలపై ప్రపంచ లక్ష్యం, నష్టాలు వంటివాటిపై ఏకాభిప్రాయం కుదరడం లేదన్నారు. సమానత్వ సిద్ధాంతాలను, కామన్ బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్-రెస్పెక్టివ్ కేపబిలిటీస్ సూత్రాలను తేలిగ్గా మర్చిపోవడానికి లేదా ఉపేక్షించడానికి విశేష ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.
 
పారిస్ ఒప్పందంలోని సూత్రాలకు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని చెప్పేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే భారత దేశ వైఖరిని తాను స్పష్టంగా చెప్పానని ఆయన తెలిపారు. ఉద్గారాలకు కారణమవుతున్న చరిత్రగల దేశాలను, అభివృద్ధి చెందిన దేశాల బాధ్యతలను ఉపేక్షించరాదని చెప్పానని చెప్పారు. 
 
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో ఏ దేశం వాటా అయినా, ప్రపంచ జనాభాలో ఆ దేశ జనాభా వాటాకు సమానంగా ఉండాలని, దానినే సమానత్వం అంటారని భూపేందర్ యాదవ్ తెలిపారు. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రతి దేశానికి ఉందని, అయితే అభివృద్ధి చెందిన దేశాలు ప్రధాన బాధ్యతను స్వీకరించాలని ఈ సూత్రాలు గుర్తించాయని తెలిపారు.
 
మేజర్ ఎమిటర్స్, టాప్ ఎమిటర్స్ అనే కొత్త కేటగిరీలను సృష్టించి, భారత్ వంటి దేశాలకు మరింత విస్తృత బాధ్యతలను అప్పగించాలనే ప్రయత్నాలకు మద్దతిచ్చేది లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఒడంబడికలో కానీ, పారిస్ అగ్రిమెంట్‌లో కానీ ఇటువంటి కేటగిరీలకు ప్రాతిపదిక లేదని పేర్కొన్నారు. కవర్ డెసిషన్‌లో 2020కి పూర్వపు ఆకాంక్షలలో అంతరాలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. 
 
దీనివల్ల 2020 తర్వాత ఉద్గారాల తగ్గింపు భారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయంగా బదిలీ చేయడానికి దారి తీసిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు గ్లోబల్ కార్బన్ బడ్జెట్‌లో విపరీతమైన వాటాను వినియోగించుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు వాతావరణ మార్పులను కట్టడి చేయడానికి, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి కృషిని మరింత పెంచాలని, వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. 
 
అయితే దీని కోసం నిధులను అభివృద్ధి చెందిన దేశాల నుంచి వేగంగా సేకరించాలని చెప్పారు. ఈ సమావేశాల తొలి వారంలో ‘మిటిగేషన్ వర్క్ ప్రోగ్రామ్’ చర్చలో కార్బన్ డయాక్సైడ్ టాప్ 20 ఎమిటర్స్‌పై సంపన్న దేశాలు దృష్టి పెట్టాయి. అప్పుడు కూడా ఆ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంది. ఈ సందర్భంగా భారత్‌కు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా మద్దతు పలికాయి. 
 
నిర్దిష్ట వనరులను లేదా రంగాలను లేదా వాయువులను ప్రత్యేకించి చూసి, చర్యలు తీసుకోరాదని యాదవ్ తెలిపారు. ఈ విషయంలో మన దేశానికి యూరోపియన్ యూనియన్ కూడా మద్దతు పలికిందన్నారు. టెక్నాలజీ బదిలీ, సహకారం గురించి కవర్ టెక్స్ట్‌లో పదునైన మాటలు ఉండాలని చెప్పారు. కొత్త టెక్నాలజీలకు గ్రీన్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. 
 
టెక్నాలజీ, ఫైనాన్స్‌లకు వర్తించే సపోర్ట్ గ్యాప్స్ అమలు సాధనాలను గుర్తించడానికి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్ అమలులో వైఫల్యాలు వెంటాడుతున్నాయని చెప్పారు. పారిస్ అగ్రిమెంట్ క్రింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకారం అందజేయడంలో వైఫల్యాలు వ్యవస్థాగతంగా కొనసాగుతున్నాయని వివరించారు. 
 
ఆకాంక్షల అమలుకు ఇది పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పారు. వాతావరణ మార్పుల కట్టడికి సంబంధించిన సూత్రాల అమలు, నష్టం గురించి కవర్ డెసిషన్‌లో బలంగా పేర్కొనాలని కేంద్ర మంత్రి తెలిపారు. దీని కోసం నిధులను 2025 నాటికి రెట్టింపు చేయాలని పేర్కొంటూ దేశ స్థాయిలో ఈ ప్రణాళికలను అమలు చేయడానికి, నష్టాలను సర్దుబాటు చేయడానికి నిధులను సమకూర్చాలని స్పష్టం చేశారు. 
 
అన్ని ఖనిజ ఇంధనాలను క్రమంగా తగ్గించాలని, కేవలం బొగ్గును మాత్రమే కాదని, ఈ నిర్ణయంతో చర్చలను ముగించాలని శనివారం భారత్ ప్రతిపాదించింది. దీనికి తాము మద్దతిస్తామని యూరోపియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్స్ టిమ్మెర్మన్స్ మంగళవారం మీడియాకు తెలిపారు. 
 
గత ఏడాది తాము బొగ్గును క్రమంగా తగ్గించడానికి అంగీకరించామని, దీని కోసం తాము చేస్తున్న కృషి నుంచి దృష్టి మళ్లించకూడదని చెప్పారు. ఏటా 100 బిలియన్ డాలర్లను సేకరిస్తామని సంపన్న దేశాలు 2009లో హామీ ఇచ్చాయి. వాతావరణ మార్పుల కట్టడికి కృషి చేసే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయపడటం కోసం ఈ నిధిని ఇస్తామని చెప్పాయి. 
 
కానీ ఈ నిధిని సేకరించడంలో విఫలమవుతున్నాయి. భారత దేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేయాలని సంపన్న దేశాలను డిమాండ్ చేస్తున్నాయి.  ట్రిలియన్ల డాలర్లలో నిధిని సమకూర్చాలని కోరుతున్నాయి. వాతావరణ మార్పుల కట్టడి చర్యలకు ఖర్చులు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. క్లైమేట్ ఫైనాన్స్ నిర్వచనంపై స్పష్టత ఇవ్వాలని భారత దేశం కోరుతోంది.