ఇరాన్‌లో నిరసనకారులపై కాల్పుల్లో ఏడుగురు మృతి

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనలలో రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారి తూటాలకు ఇద్దరు పిల్లలు, ఓ మహిళ సహా ఏడుగురు మరణించారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యేనని ఇరాన్‌ అధికార వార్తా సంస్థ చెబుతుండగా ప్రభుత్వమే నిరసనకారుల ప్రాణాలు తీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దారుణ ఘటన ఈజెహ్‌ నగరంలో చోటుచేసుకుంది. 9, 13 ఏళ్ల పిల్లలు ఇద్దరు, 45 ఏళ్ల మహిళ సహా ఏడుగురు బుల్లెట్లకు బలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తులు పరారయ్యారు. మరోవైపు, రాజధాని టెహ్రాన్‌లో నిరసనకారులపై భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి.
మూడు రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా మెట్రో స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న మహిళలపై భద్రతా దళాలు లాఠీచార్జి చేశాయి. కాల్పులు జరిపాయి. పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అండర్‌గ్రౌండ్‌ రైలులో హిజాబ్‌ ధరించకుండా నిరసన తెలుపుతున్న మహిళలను భద్రతా దళాల వారు దారుణంగా కొట్టారు.
మెట్రో స్టేషన్‌, రైలులో హింస వీడియాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రెండు నెలలకుపైగా హిజాబ్‌, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. సెప్టెంబరు 16న మహ్స అమినీ అనే యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వ అణచివేత చర్యల్లో వందలాది మంది నిరసనకారులు మరణించారు.
వేలాది మంది అరెస్ట్‌ అయ్యారు. అయినా సరే హిజాబ్‌లను తగులబెడుతూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరంకుశ ప్రభుత్వం వద్దంటూ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇస్ఫహన్‌ నగరంలో బైక్‌పై వచ్చిన దుండగులు భద్రతా దళాలపై గన్స్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సిబ్బంది మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.