భారతదేశ పౌరులంతా హిందువులే

భారతీయులందరూ హిందువులేనని, అందరి డీఎన్ఏలో హిందూత్వ ఉందని  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఎవరి ఆచార వ్యవహారాలను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. మనందరికీ ఒకే వారసత్వం ఉన్నదని, మనందరికీ ఒకే డిఎన్ఏ అని, ఇది గత 40,000 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నదని చెప్పారు. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి మతంతో  సంబంధం లేకుండా ఈ దేశాన్ని తమ మాతృభూమిగా భావించేవారంతా హిందువులే అని తెలిపారు.  భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశ పురాతన లక్షణంగా పదే పదే ఆయన ప్రస్తావింఛారు. ప్రపంచంలో అందరినీ ఏకం చేయడంలో హిందుత్వమే ఏకైక ఆలోచన అని పేర్కొన్నారు.  
 ‘‘భారత ప్రజలందరూ హిందువులే. భారతదేశాన్ని తన మాతృభూమిగా భావించేవాడు హిందువు. అది ఏ మతాన్ని అనుసరించే వ్యక్తి అయినా, ఎలాంటి దుస్తులు ధరించే వ్యక్తి అయినా. ఇది నిజం సంఘ్ ఈ సత్యాన్ని చెబుతోంది. వందల సంవత్సరాలుగా మనం ఐక్యంగా ఉండడమే దీనికి కారణం’’ అని భగవత్ చెప్పారు.
 
భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని తాము 1925 నుండి (ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించినప్పటి నుండి) చెబుతున్నామని ఆయన గుర్తు చేశారు. దేశాన్ని తమ మాతృభూమిగా భావించి, భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతితో జీవించాలని కోరుకునే వారు, మతం, సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఈ దిశగా కృషి చేసేవారంతే హిందువులే అని డా. భగవత్ వెల్లడించారు. 
 
హిందుత్వ భావజాలం భిన్నత్వాన్ని గుర్తిస్తుందని, ప్రజల మధ్య ఏకత్వాన్ని విశ్వసిస్తుందని ఆయన తెలిపారు. భిన్నతలను ఏకీకృతం చేయడాన్ని విశ్వసించే మొత్తం ప్రపంచంలో హిందూత్వ ఏకైక ఆలోచన అనీ పేర్కొంటూ ఎందుకంటే ఇది ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా ఇటువంటి వైవిధ్యాలను కలిగి ఉందని పేర్కొన్నారు.
 
ఇదే నిజమని సవయంసేవకులు అందరూ గట్టిగా విశ్వసించాలని, ఇదే విషయాన్ని చెప్పాలని ఆయన మార్గనిర్ధేశం చేశారు. దాని ఆధారంగా మనం ఐక్యంగా ఉండగలం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తి, జాతీయ స్వభావాన్ని నిర్మించడం.. ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావడం సంఘ్ చేపట్టిన కార్యం అని సర్ సంఘచాలక్ వివరించారు. 
మన దేశంలో ప్రతివారికి వేర్వేరు దేవతలు ఉంటూ ఉంటారని, కొందరికి అసలు ఏ దేవుడి మీద నమ్మకం ఉండదని అంటూ … అటువంటి విభిన్న తత్వాలు గల ప్రజలు మనదేశంలో ఉన్నారని డా. భగవత్ గుర్తు చేశారు. వేదం కాలం నుండి ఈ విధంగా సాగుతున్నదని చెప్పారు. మన దేశంలో  వేర్వేరు మతాలు, వేర్వేరు కులాలు ఉంటూ వస్తున్నా ప్రజలంతా ఒకటిగా ఉంటున్నారని తెలిపారు. మన దేశంలో రాజులు మారుతూ ఉంటారు కానీ, దేశం ఒకటిగానే ఉంటుందని స్పష్టం చేశారు. 
 
ఈ క్రమంలో దేశంలోని అన్ని మత విశ్వాసాలను, వారి ఆచారాలను గౌరవించాలని కూడా డా. భగవత్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై దేశం మొత్తం ఐక్యంగా పోరాడిందని ఆయన గుర్తుచేశారు. మన సంస్కృతి మనల్ని కలుపుతుంది. మనలో మనం ఎంత పోట్లాడుకున్నా సంక్షోభ సమయాల్లో ఐక్యంగా ఉంటాం. దేశం ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు కలిసి పోరాడతాం అని స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ గురించి అర్ధం చేసుకోవాలంటే సంఘ్ శాఖకు రావడమే మార్గమని ఆయన తెలిపారు. అందుకు ఎటువంటి రుసుము చెల్లింపు వలసిన అవసరం లేదని అంటూ తింటేనే మిఠాయి తీయదనం తెలుస్తుందని చెప్పారు. ఆకాశాన్ని ఏ విధంగా ఐతే మరి దేనితోనూ పోల్చలేమో, సంఘాన్ని సహితం మరెవ్వరితో పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు. చదవడం,  వ్రాయడం ద్వారా కూడా అర్థం చేసుకోలేమని చెప్పారు.