ఇండియా–ఇండోనేషియా మధ్య సాంస్కృతిక వారసత్వ బంధం

భారతదేశం, ఇండోనేషియా భాగస్వామ్య వారసత్వం, సంస్కృతితో అనుసంధానంగా ఉన్నాయని, మనం ఇప్పటికీ బాలితో పురాతన వాణిజ్య సంబంధాలను జరుపుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన భారతీయ ప్రవాసుల ఔట్రీచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ  2018లో వచ్చిన భూకంపం వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయిందని. అప్పుడు తాము వెంటనే సముద్ర మైత్రి ఆపరేషన్ ప్రారంభించామని గుర్తు చేశారు.  
 
ఇక.. జి20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియాలోని బాలిలో ఉన్నారు. తన ప్రసంగంలో భారతదేశం, ఇండోనేషియా షేర్ చేసుకుంటున్న సంబంధాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.  ఇండోనేషియాలోని భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ‘మోదీ, మోదీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మోదీ ఇండోనేషియా సంప్రదాయ వాద్య పరికరాలను వాయించారు. ఈ కార్యక్రమానికి ఇండోనేశియా నలు మూలల నుండి విభిన్న వర్గాల వారు పలువురు ఉత్సాహంగా తరలివచ్చారు.
మోదీ మాట్లాడుతూ, ‘‘బాలీలో నేను మీతో మాట్లాడుతున్న సమయంలో, ఇక్కడికి 1,500 కిలోమీటర్ల దూరంలో భారత దేశంలో ఉన్న కటక్‌లో బాలి యాత్ర మహోత్సవం జరుగుతోంది’’ అని చెప్పారు. భారత్-ఇండోనేషియా వ్యాపార సంబంధాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని, దానిని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ ఏడాది జరుగుతున్న బాలి యాత్ర దృశ్యాలను ఇండోనేషియన్లు ఇంటర్నెట్‌లో చూసి, గర్వపడతారని, సంతోషిస్తారని చెప్పారు. కరోనా  మహమ్మారి వల్ల ఏర్పడిన సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒడిశాలో ప్రజల భాగస్వామ్యంతో బాలి జాతర మహోత్సవం జరుగుతోందని చెప్పారు.
 
అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఇండోనేషియాలోని రామాయణ సంప్రదాయాన్ని మనం గర్వంగా గుర్తు చేసుకుంటామని పేర్కొన్నారు. భారతీయుల ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, శ్రమించే తత్వం నేటి ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయని తెలిపారు. 
 
నేటి భారతం ఆలోచనలు చిన్న చిన్నవాటి గురించి కాదని స్పష్టం చేస్తూ నేడు భారత దేశం మునుపెన్నడూ లేనంత స్థాయిలో, వేగంతో పని చేస్తోందని తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆగస్టు 15 న భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్యం జరుపుకుంది.  ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశం రెండు రోజుల తర్వాత – ఆగష్టు 17 న వస్తుంది. అయితే భారతదేశానికి రెండు సంవత్సరాల ముందు స్వాతంత్ర్యం పొందడం ఇండోనేషియా అదృష్టం. ఇండోనేషియా నుండి భారతదేశం చాలా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
తదుపరి ‘ప్రవాసీయ భారతీయ దివస్’ సమ్మేళనం 2023 జనవరి 8 నుండి 10  వరకు మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో జరుగుతుందని, ఆ సమ్మేళనానికి హాజరు కావాలని, ఆ తరువాత గుజరాత్ లో నిర్వహించే గాలిపటాల ఉత్సవంలో కూడా పాల్గొనాలని సముదాయం సభ్యులను,  ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.