
ఆంధ్ర ప్రదేశ్ లోని దాదాపుగా 2091 ఆలయాలకు దూప దీప నైవేథ్యాల పథకం కింద లబ్ధి చేకూర్చే ఆపధకాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించేందుకు సిద్దపడుతోంది. ఇందులో భాగంగా ఒక్క ఆలయానికి రూ.5 వేల నగదును నేరుగా ఆయా ఆలయ పూజారి అకౌంట్‌లోకి వేస్తోంది.
ఈ పథకం ద్వారా రూ.2 వేల రూపాయాలు ఆలయంలోని దీపాలు వెలిగించేందుకు అయ్యే నూనె, ఇతరత్రా ఖర్చులకు, రూ.3 వేలు ఆయా పూజారి ఖర్చులకు కేటాయించాలి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో పూజారుల వివరాలు, ఏయే దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తుందనే దానిపై ఏపీ దేవాదాయధర్మాదాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
దేవాదాయశాఖలో రిజిస్ట్రర్ అయ్యి ఉండి, గ్రామీణ ప్రాంతంలో రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూమి, ఐదెకరాలలోపు మెట్ట భూమి ఉండి, ఆలయానికి అన్ని రకాల ఆదాయం కలిపి ఏడాదికి రూ.30 వేలకు మించిన ఆలయాలు ఈజాబితాలోకి చేర్చారు.
జిల్లా దేవాదాయశాఖ అధికారుల వద్ద నుండి వెళ్లిన జాబితా ప్రకారం 11 మంది అధికారులు ఈ మొత్తం ప్రక్రియను పరిశీలించారు. అధికారులు 20 ఆలయాల చొప్పన ర్యాండమ్‌గా పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు.
వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2008 నుండి ఈపథకం అమలులో ఉంది. అయితే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఈపథకం క్రమేపీ తగ్గింది. దీంతో పథకం వర్తించే ఆలయాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా విడుదలైన ఉత్తర్వుల్లో 2091 ఆలయాలను జాబితాలోకి చేర్చారు.
తద్వారా ఒక్కొక్క ఆలయానికి రూ.5 వేలు అందించడం ద్వారా ప్రభుత్వానికి భారమే. అయినప్పటికీ హిందూ సంప్రదాయాలు కాపాడాలంటే ఆలయాలను కూడా సంరక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో దేవాదాయశాఖ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది ప్రభుత్వం.
వాస్తవంగా వైసీపీ ప్రభుత్వంలో పాస్టర్లకు డబ్బులు కేటాయించడం మొదట్లో వివాదస్పదమైంది. క్రైస్తవులను జగన్ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరిగింది. పలు హిందూ దేవాలయాలపై సహితం దాడులు జరుగుతూ ఉండడంతో ప్రభుత్వం అప్రదిష్టపాలు కావలసి వస్తున్నది.
అయితే దేవాలయాలకు నిధులు కేటాయింపుతోపాటు, ఉత్సవాలకు నిధులు, ప్రస్తుతం దూప దీప నైవేధ్యాలకు పూజరుల ఖాతాలకు నగదు పంపిణీతో అన్ని మతాలకు-కులాలకు సమన్యాయమనే నినాదం ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా తమ ప్రభుత్వంపై `హిందూ వ్యతిరేకి’ ముద్రను తొలగించుకునేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
మరోవంక, ఇఏపీ ప్రభుత్వం దేవాదాయశాఖ ఆదాయంపైనా దృష్టి సారించింది. గతంలో భూములు కౌలుకు వేలానికి సంబంధించి ఉన్న ధరలను, ప్రస్తుత ధరలపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఆలయాల్లో ఉత్సవాలకు వస్తున్న ఆదాయ-వ్యయాలపై ప్రీ ఆడిట్ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తుంది.
దానితో దేవాలయాల ఆదాయంపై ప్రభుత్వం ఎందుకింత ఆసక్తి కనబరిచిందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో ప్రీ ఆడిట్ విధానాన్ని రాష్ట్ర ఈవోల సంఘం వ్యతిరేకించింది. దీనివల్ల ఆలయాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు