విశాఖలో రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ డిఆర్‌ఎం అనూప్‌ సత్పతి తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రోడ్డులో రూ.106 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ భవనాల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. 
 
 తొలిదశలో పాత వైర్‌లెస్‌ కాలనీలో 13 ఎకరాల్లో జోన్‌ కోసం భూసేకరణ జరుగుతోందని, ఎనిమిది ఎకరాల్లో ప్రతి అంతస్తుల్లో 4000-4500 చదరపు మీటర్ల వైశాల్యంతో మల్టీ స్టోరెడ్‌ భవనాల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. డిపిఆర్‌ను సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 
 
విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణకు కేంద్రం రూ.456 కోట్లను ఇప్పటికే మంజూరు చేసిందని, దేశంలోనే అత్యాధునిక వసతులతో ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నామని చెప్పారు. 36 నెలల్లో ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నూతన ప్రణాళికలలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో అదనంగా మరో రెండు రైల్వే ప్లాట్‌ఫారాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. 
 
విశాఖ నుంచి విజయవాడ లేదా తిరుపతికి సెమీ బులెట్‌ వందే భారత్‌ రైలును ప్రాంభించడానికి పైకి ప్రతిపాదనలు పంపించామని, అనుమతి వచ్చిన వెంటనే ట్రైల్‌ రన్‌ జరిపి సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు.