తరచూ ఆగిపోతున్న బుల్లెట్ ప్రూఫ్ కార్.. రాజాసింగ్ అసహనం

 తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ తరచూ రిపేర్లకు గురవుతూ, ఎక్కడపడితే అక్కడ ఆగిపోతూ ఉండడం పట్ల బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్  రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.  ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉన్న తనకు ఇలాంటి వాహనం ఇవ్వటమేంటని ఆయన ప్రశ్నించారు. 
 
రాజాసింగ్‌‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఆ వాహనంలోనే వెళ్లాల్సిందిగా పోలీసులు రాజాసింగ్‌కు తెలిపారు. అయితే తరుచూ వాహనం చెడిపోతుండటంతో ప్రభుత్వంపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇంటిలిజెన్స్ ఐజీకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవ‌టం లేదని రాజసింగ్ ఆవేదన చెందారు.
 
“4 నెలల క్రితం రోడ్డు మధ్యలో వెహికల్ ఆగిపోతే ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌కి తిరిగి పంపించాను. రిపేర్లు చేసి అదే వెహికల్‌ను మళ్లీ కేటాయించారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ ఆ వాహనం ఆగిపోయింది. గన్‌మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను” అని గుర్తు చేశారు. 
 
తాజాగా, అఫ్జల్‌గంజ్‌ వద్ద మరోసారి ఆ వాహనం ఆగిపోవడంతో, తాను   సొంత వాహనం రప్పించుకుని వెళ్లానని తెలిపారు. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న తనకు ఇంటెలిజెన్స్‌ ఇలాంటి వాహనం ఇవ్వడం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేశారు. 
 
ఇదిలా ఉంటే ఆగస్టు లో పి డి యాక్ట్  ఫై అరెస్ట్ చేయడంతో  జైలుకు వెళ్లిన రాజాసింగ్ గత వారం హైకోర్టు ఆ కేసును కొట్టేయడంతో జైలు నుండి విడుదలై  వచ్చారు.