విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ రైల్వేస్టేషన్‌గా దీనిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో ఆయన సోమవారం దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్‌కుమాజైన్ తదితరలతో కలసి  పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
 
 రానున్న 40 ఏళ్లలో అవసరాలకు తగ్గట్లుగా ఆధునీకరణ ఉంటుందని చెప్పారు. విజయవాడ టు సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు రాబోతున్నాయని వెల్లడించారు.  తిరుపతి వరకు వందే భారత్ రైళ్లు పొడిగించాలని ప్రధానిని, రైల్వే మంత్రిని కోరామని కిషన్‌రెడ్డి తెలిపారు.
1,300 కి.మీ మేర కొత్త లైన్ల కోసం భూసేకరణ జరుగుతోందని తెలిపారు.  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంలను పూర్తిగా ఆధునీకరిస్తామని పార్కింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.  26 ఆధునిక లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, విమానాశ్రయం తరహాలో రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. మూడు దశల్లో, 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
 
 కాజీపేటలో రూ.384 కోట్లతో ఇన్ వ్యాగన్ వర్క్‌షాప్ కోసం టెండర్లు పిలిచామని, 150 ఎకరాల్లో భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు రాష్ట్రం నిధులు ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రం నిధులు విడుదల చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయని చెప్పారు.