లైంగిక వేధింపుల కేసుతో ఎన్‌సీపీ ఎమ్యెల్యే రాజీనామా

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి, జైలుకు వెళ్లి వచ్చిన ఎన్‌సీపీ నేత  జితేంద్ర అవద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనపై పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల కారణంగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది.
ముంబ్రా-కల్వా నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన జితేంద్ర అవద్‌.. ఉద్దవ్‌ ఠాక్రే క్యేబినెట్‌లో హౌజింగ్‌, మైనార్టీ అఫైర్స్‌ మంత్రిగా కొనసాగారు. తనపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జితేంద్ర అవద్‌ ప్రకటించారు.
జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆయన తన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు థానే పోలీసులు ఆరోపిస్తున్నారు. అలాగే, ఈ నెల 7న ‘హర్ హర్ మహాదేవ్’ మరాఠీ సినిమా ప్రదర్శనను బలవంతంగా నిలిపివేసినందుకు ఆయనపై థానే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు తనపై 72 గంటల వ్యవధిలో రెండు తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.