తూర్పు లడఖ్‌లో ఊహించలేని పరిస్థితి

తూర్పు లడఖ్‌లో పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, అక్కడేమి జరుగుతుందో ముందుగా ఏమీ ఊహించి చెప్పలేమని భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే  స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి (ఎల్ఏసీ) చైనా త‌న సేన‌ల‌ను త‌గ్గించ‌లేద‌ని ఆయన తెలిపారు.
మిగిలిన రెండు ఫ్రిక్షన్ పాయింట్ల (డెప్సాంగ్, దెమ్‌చోక్) వద్ద సమస్యలను పరిష్కరించుకోవడంపైనే తదుపరి రౌండ్ మిలిటరీ చర్చల లక్ష్యమని తెలిపారు. ఈ ప్రాంతంలో దాదాపు 30 నెలల నుంచి ప్రతిష్టంభన నెలకొనడంతో పాటు, స‌రిహ‌ద్దు ప్రాంతంలో చైనా హెలిఫాడ్లు, ఎయిర్‌ఫీల్డ్‌, రోడ్ల నిర్మాణం చేప‌డుతోంద‌నే వార్త‌ల నేప‌ధ్యంలో జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే ఈ వ్యాఖ్య‌లు చేశారు.
మేధోమథనం సమావేశంలో జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ, తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వద్ద చైనా దళాలు తగ్గలేదని చెప్పారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఎ) బ్రిగేడ్స్‌లో శిక్షణ కోసం వచ్చినవారిలో కొందరు మాత్రమే చలికాలం కారణంగా తిరిగి వెళ్లినట్లు కనిపిస్తోందని చెప్పారు.
అక్కడి పరిస్థితిని ఏక వాక్యంలో చెప్పాలంటే, పరిస్థితి నిలకడగా ఉందని, అయితే ఊహించగలిగినది కాదని చెప్పవచ్చునని తెలిపారు. కనుమల వరకు హెలిపాడ్స్, వైమానిక స్థావరాలు, రోడ్లను చైనా నిరాఘాటంగా నిర్మిస్తోందని చెప్పారు. జీ695 హైవే విషయంలో ముఖ్యమైన పరిణామాలు జరిగాయని చెప్పారు.
ఈ హైవే ఎల్ఏసీకి సమాంతరంగా ఉందని చెబుతూ దళాలను ముందుకు నడిపించడానికి మాత్రమే కాకుండా, దళాలను ఒక సెక్టర్ నుంచి మరొక సెక్టర్‌కు తరలించడానికి కూడా ఈ హైవే చైనాకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చలి కాలం కోసం మన దళాలు సమాయత్తమవుతున్నాయని చెప్పారు.
ఏదైనా ఆగంతుక పరిస్థితి వచ్చినపుడు దీటుగా ఎదుర్కొనడానికి తగిన స్థాయిలో దళాలను, రిజర్వులను సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. అయితే విస్తృత స్థాయిలో చూసినపుడు, మన ప్రయోజనాలు, సున్నితమైన అంశాలను కాపాడుకోవడం కోసం ఎల్ఏసీ వద్ద మన చర్యలను జాగ్రత్తగా ఏకోన్ముఖం చేసుకోవడం చాలా అవసరమని చెప్పారు.
భారత్, చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో చర్చలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.  ఏడు ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద సమస్యలు ఉండేవని, వీటిలో ఐదు పాయింట్ల వద్ద సమస్యలు ఈ చర్చల వల్ల పరిష్కరించుకోగలిగామని చెప్పారు.
మిగిలిన రెండు ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. భారత్, చైనా సైన్యం, దౌత్య అధికారుల మధ్య అనేక విడతల చర్చల అనంతరం దెమ్‌చోక్, డెప్సాంగ్ రీజియన్లలో మినహా మిగిలిన ఐదు ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి ఇరు దేశాలు తమ దళాలను ఉపసంహరించుకున్నాయి.