మంత్రి అఖిల గిరిపై ఢిల్లీలో కేసు నమోదు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమబెంగాల్ మంత్రి, టీఎంసీ నాయకుడు అఖిల గిరి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల గిరిపై బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  
 
ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద అఖిల గిరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సీఎం మమతా బెనర్జీ బహిరంగంగా క్షమాపణలు  చెప్పాలని ఛటర్జీ  డిమాండ్  చేశారు. పైగా, ఆమె స్వయంగా  ఢిల్లీకి వచ్చి రాష్ట్రపతికి క్షమాపణలు తెలపాలని చట్టర్జీ స్పష్టం చేశారు. 
 
ఎప్పుడు ఎస్సి, ఎస్టీ,  గిరిజనుల గురించి ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉండే మమతా తన మంత్రి చేసిన ఇటువంటి అనుచిత వాఖ్యలపై మాట్లాడకపోవడం పట్ల ఆమె ధ్వజమెత్తారు. టిఎంసి సంస్కృతి అటువంటిది కావడంతో ఆమె మౌనంగా ఉన్నారని విమర్శించారు. 
 
కాగా, మంత్రి అఖిల్ గిరిని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని ఎప్పుడు తొలగిస్తారు..? అని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. అయితే రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించకపోవడం గమనార్హం.  ఆ మంత్రి మాటలు వినడం తమకు ఇష్టం లేదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.