బాలిలో జి20 సదస్సుకు నేడే ప్రధాని మోదీ ప్రయాణం 

ఇండోనేషియాలోని బాలి నగరంలో ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న జి20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం బయలు దేరి వెళ్లనున్నారు. మూడు కీలక సెషన్స్‌లో మోడీ పాల్గంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినరు క్వత్రా ఆదివారం  తెలిపారు. 
 
మూడు రోజల పాటు జరిపే పర్యటనలో 45 గంటల పాటు బాలీలో ఉండే ప్రధాని మోదీ సుమారు 20 భేటీల్లో పాల్గొననున్నారు. జీ20 సదస్సులో భాగంగా 10 మంది ప్రపంచాధినేతలతో ఆయన సమావేశమవుతారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 
జీ20 సదస్సులో భాగంగా ఆహారం, ఇందన భద్రత, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హెల్త్ వంటి కీలక సమావేశాల్లో మోడీ పాల్గొంటారని వినయ్ క్వాత్రా తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధన, పర్యావరణం వంటి అంశాలపై మోడీతో పాటు ఇతర నేతలు చర్చిస్తారని తెలిపారు.  బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తోనూ మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మన్ ఛాన్స్లర్ ఓలఫ్ షోల్జ్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో ఆహ్వానం మేరకు ప్రధాని ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. జి20 ప్రసుత్త అధ్యక్ష దేశంగా ఇండోనేషియా ఉంది.  డిసెంబర్‌ 1 నుంచి భారత్‌ అధ్యక్ష బాధ్యతల్ని తీసుకుంటుంది.
భారత్‌తో పాటు అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇంగ్లండ్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, ఇయూ, దక్షిణ కొరియా దేశాలు జి20 దేశాలుగా ఉన్నాయి.
భారత జి20 అధ్యక్ష పదవికి అమెరికా 
భారత జి20 అధ్యక్ష పదవికి అమెరికా మద్దతిస్తోందని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ ట్వీట్‌ చేశారు. భారతదేశం డిసెంబర్‌ 1న శక్తివంతమైన గ్రూపు అధ్యక్ష పదవిని చేపట్టనుంది.
భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, మరియు అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌ ఆదివారం కంబోడియాలో జరిగిన అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌) శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధం,  ద్వైపాక్షిక సంబంధాలతో సహా పలు అంశాలపై చర్చించారు. బ్లింకెన్‌ భారతదేశం యొక్క జి20 అధ్యక్ష పదవికి కూడా మద్దతు ఇచ్చినట్లు జైశంకర్‌ తెలిపారు.
ఈ సందర్భంగా బ్లింకెన్‌ మాట్లాడుతూ,  తమ భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను చర్చించడానికి ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశం అంచున భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ను కలిసినట్లు చెప్పారు.
భారతదేశపు జి20 ప్రెసిడెన్సీకి యూఎస్‌ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. `యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో మంచి సమావేశం. ఉక్రెయిన్‌, ఇండో-పసిఫిక్‌, ఎనర్జీ, జి20, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు’ అని జైశంకర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.