శిలాజ ఇంధనం ఆపడమే వాతావరణ సమస్యలకు పరిష్కారం

శిలాజ ఇంధన వినియోగాన్ని ఆపడమే వాతావరణ సమస్యలకు పరిష్కారమని భారత్‌ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై ఈజిప్టులో జరుగుతున్న కాప్‌ 27 సదస్సులో భారత్‌ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రతిపాదించారు.  భూ తాపాన్ని కనీస స్థాయికి నియంత్రించాలను ప్యారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని సాధించాలంటే శిలాజ ఇంధన వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించాల్సి ఉంటుందని భారత్‌ పేర్కొంది.
ఒకేసారి కాకపోయినా దశల వారీగా నైనా ఆ తరహా ఇంధన వినియోగాన్ని తగ్గించడం ప్రారంభించాలని, క్రమేణా పూర్తిగా మానుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. వాతావరణ మార్పులపై ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ రూపొందించిన ఆరవ అంచనా నివేదికపై శని, ఆదివారాల్లో చర్చ జరిగింది.
ఈ నివేదికలో వాతావరణ కాలుష్యానికి కారణమైన ఉద్గారాల విడుదల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా స్వల్ప స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉద్గారాల విడుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
గత ఏడాదితో పోలిస్తే భారత్‌ ఉద్గారాల వాటా ఆరు శాతం పెరిగే అవకాశం ఉందని, దీనిలో అధిక భాగం బొగ్గు వినియోగం ద్వారా వచ్చేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత్‌ ప్రతినిధులు వివిధ దేశాల్లో జరుగుతున్న శిలాజ ఇంధన వినియోగాన్ని ప్రస్తావించారు.
‘సహజవాయవు, ఆయిల్‌ వినియోగం కూడా వాతావరణ కాలుష్యానికి కారణం అవుతోంది. అది కూడా కాలుష్యకారక ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. ఈ విషయాన్ని విస్మరించి ఏ ఒక్క ఇంధనానోు విలన్‌గా చూపడం సరికాదు’ అని భారత్‌ ప్రతినిధులు వాదించారు.
భారత్‌ లేవనెత్తిన ఈ అంశం సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసిందని సమాచారం. చర్చల్లో పాల్గన్న 194 దేశాల ప్రతినిధుల్లో పలువరు భారత్‌ లేవనెత్తిన ఈ అంశాన్ని సమర్థించినట్లు తెలిసింది. వీరిలో కొందరు వాతావరణ మార్పులకుసంబంధించి చారిత్రక బాధ్యతను ప్రస్తావించడానికి ప్రయత్నించారని సమాచారం.
పొంచి ఉన్న ప్రమాదానికి ఏదో ఒక ఇంధనాన్నో, ఉద్గారాన్నో కారణంగా చూపి ముద్ర వేస్తున్నారని, మిగిలిన వాటిని పర్యావరణ హితమనో, సుస్థిర మైనవనో చెప్పడాన్ని భారత ప్రతినిధి బృందం తప్పు పట్టింది. అలా చెప్పడానికి ప్రాతిపదిక ఏమిటని నిలదీసింది.
 ‘ప్రస్తుతానికి ఉన్న సైన్స్‌ ప్రకారం అన్ని శిలాజ ఇంధనాలు గ్రీన్‌హౌస్‌ వాయువులను వెదజల్లుతాయి. వాతావరణ కాలుష్యాన్ని పెంచుతాయి. దీనికి భిన్నంగా చెప్పడానికి ప్రాతిపదిక ఏమిటో వెల్లడించాలి. జాతీయ పరిస్థితుల కనుగుణంగా అంతర్జాతీయ లక్ష్యమైన క్లీన్‌ ఎనర్జీ వైపు ఏ దేశమైనా ప్రయణించాల్సి ఉంటుంది’ అని భారత్‌ ప్రతినిధులు చెప్పారు. వివిధ రంగాలలో అసమానతలతో ఉన్న పరిస్థితులలో ప్రస్తుత సమాజం మనుగడ సాగిస్తోందను అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలని అన్నారు.