అమెరికాలో జలపాతంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.  జలపాతంలో మునగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి , రోహిత్ మణికంఠ రేపాల అనే విద్యార్థులు మృతి చెందారు. అమెరికాలోని అరిజోనాలోని ఫాజిల్‌ క్రీక్‌ ఫాల్స్ వద్ద ఈ ఘటన జరిగింది.  గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన సందర్భంగా 16 మంది స్నేహితులతో కూడిన బృందం మే 8వ తేదీన ఈ జలపాతం వద్దకు వెళ్లింది. రాకేష్, రోహిత్ జలపాతం వద్ద ఈత కొడుతుండగా ఈ దుర్ఘటన ఎదురైంది. అలర్ట్ అయిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొదటి రోజు వీరి ఆచూకీ లభించలేదు. రెండో రోజు మృతదేహాలను కనుగొన్నారు.  వీరిలో ఖమ్మం నగరంలోని విద్యారంగ  ప్రముఖుడైన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు రాకేష్ రెడ్డి ఉన్నారు. ఇతను కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన రోహిత్ నేపథ్యం తెలియాల్సి ఉంది.

కుమారుడి గ్రాడ్యూయేషన్ కు హాజరయ్యేందుకు ఇటీవలేనే రాకేశ్ తల్లిదండ్రులు కూడా అమెరికాకు వెళ్లారు. కానీ అనుకోని ప్రమాదంలో ఏకైక కుమారుడు మృతి చెందటంతో వారి ఇంట తీవ్రమైన విషాదం నెలకొంది. గడిచిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఈ జలపాతం వద్ద ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయినట్లు తెలిసింది.

ఇక  ఏప్రిల్ నెలలోనూ  ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్కాంట్లాండ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా బ్రిటన్ లోని ఓ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు.వీరిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు ఉండగా మరో విద్యార్థి ఏపీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు.

స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్న వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి పెర్త్‌షైర్‌లోని లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌కి వెళ్లారు. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుండగ ప్రమాదవశాత్తుగా వీరిద్దరూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు. 

ఈ మేరకు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి వారి మృతదేహాలను గుర్తించారు. వీరి మృతి విషయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయినవారిని జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు.