నూత‌న గ‌న్ లైసెన్స్‌ల‌నూ జారీ చేయ‌రాద‌ని పంజాబ్ నిర్ణయం

పంజాబ్‌లో గ‌న్ క‌ల్చ‌ర్‌కు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కఠిన చర్యలకు సమాయత్తమైనది.  తుపాకీ సంస్కృతిని నిరోధించేందుకు భ‌గ‌వంత్ మాన్ సార‌ధ్యంలోని ఆప్ స‌ర్కార్  నూత‌న గ‌న్ లైసెన్స్‌ల‌నూ జారీ చేయ‌రాద‌ని  ఆదేశించింది.
జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా పరిశీలించి సరే అనుకుంటేనే కొత్తగా గన్ లైసన్స్‌లివ్వాలని  మాన్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన లైసన్స్‌లను రాబోయే మూడు నెలల్లో సమీక్షించాలని కూడా నిర్ణయించారు. ఆయుధాల‌ను బ‌హిరంగంగా ప్రద‌ర్శించ‌డంతో పాటు తుపాకీ సంస్కృతి, హింస‌ను ప్రేరేపించే పాట‌ల‌పై నిషేధం విధించింది.
తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం బ‌హిరంగ స‌భలు, ప్రార్ధ‌నా స్ధ‌లాలు, పెండ్లి వేడుక‌లు, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో ఆయుధాల‌ను తీసుకురావ‌డం, వాటిని ప్ర‌ద‌ర్శించ‌డాన్ని పూర్తిగా నిషేధించారు.  త‌ప్పుడు వ్య‌క్తికి ఆయుధ లైసెన్సు జారీ చేసిన‌ట్టు వెల్ల‌డైతే త‌క్ష‌ణ‌మే దాన్ని ర‌ద్దు చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం పేర్కొంది.

ఆయుధాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై స‌హా బ‌హిరంగంగా ప్ర‌ద‌ర్శించ‌డంపై నిషేధం విధించారు. గ‌న్ వ‌య‌లెన్స్ పెచ్చుమీరింద‌ని విప‌క్ష పార్టీల నుంచి ఆప్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

భగవంత్ మాన్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే వీఐపీలకు భద్రత తొలగించి కలకలం రేపింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న ఒక్కరోజు వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, సింగర్ సిద్ధూ మూసేవాలాను కొందరు దుండగులు కాల్చి చంపారు. గ్యాంగ్‌స్టర్లు ఎందరో ఈ ఘటనకు లింక్ అయి ఉండటంతో ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించింది.

కొందరు గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపింది. ప్రముఖులకు భద్రత తొలగిస్తూ మాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, అమృత్‌స‌ర్‌లో శివ‌సేన నేత సుధీర్ సూరిని సాయుధ దుండ‌గులు ఇటీవ‌ల ప‌ట్ట‌ప‌గ‌లే కాల్చిచంపిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇక ఫ‌రీద్‌కోట్‌లో డేరా బాబా అనుచురుడు ప్ర‌దీప్ సింగ్‌ను కొంద‌రు కాల్చిచంపారు.

అంతేకాదు పొరుగునే ఉన్న పాకిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున తుపాకులను, అత్యంత అధునాతన ఆయుధాలను, డ్రగ్స్‌ను స్మగ్లర్లు పంజాబ్‌లోకి అక్రమంగా తరలిస్తున్నారు.  డ్రోన్‌ల ద్వారా కూడా పాకిస్థాన్ నుంచి పంజాబ్‌లోకి అక్రమంగా ఆయుధాలు పెద్దఎత్తున తరలివస్తుండటంతో ఆప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి తోడు ఖలిస్థాన్ ఉగ్రవాదం వేళ్లూనుకుంటుండటంతో మాన్ సర్కారు గన్ లైసన్స్‌లపై తాజా నిర్ణయాలు తీసుకుంది.