ప్రధాని పర్యటనకు దూరంగా ఏకాకిగా మిగిలిన కేసీఆర్

వరుసగా నాలుగోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మొహం చాటేశారు. పార్లమెంటరీ  ప్రజాస్వామ్య వ్యవస్థలో అనుసరించే సాధారణ మర్యాదలకు తిలోదకాలు ఇవ్వడం ద్వారా రాజకీయంగా ఆయన తనను తానే చిన్నబుచ్చుకున్న ట్లు అయింది. 

ప్రధానికి కేసీఆర్ స్వాగతం పలకనంత మాత్రం చేత ప్రధాని ప్రతిష్టకు గాని, లేదా ఆ మాటకొస్తే తెలంగాణాలో బిజెపి ప్రజాదరణకు గాని ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒక విధంగా రాజకీయంగా కేసీఆర్ ఏకాకి అవుతున్న సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి. 

ఇంతకు ముందు మూడు పర్యాయాలు ప్రధాని మోదీ ఒక విధంగా ప్రైవేట్  కార్యక్రమాలకు రావడంతో, కేసీఆర్ గైరాజరైనా సర్దిచెప్పుకొనే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణకే ప్రతిష్టాకరమైన ఎరువుల కర్మాగారం పునప్రారంభంకు వచ్చిన సందర్భంగా మొహం చాటేయడం ద్వారా ప్రధానితో కలసి ప్రజల ముందుకు వచ్చే అవకాశాన్ని ఆయనే పోగొట్టుకొన్నట్లు అయింది. 

దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఒక విధంగా కేసీఆర్ పట్ల విముఖత ప్రదర్శిస్తున్న కారణంగా ఆయన రాజకీయంగా ఆత్మరక్షణలో పడ్డారా అనే అనుమానం కలుగుతున్నది. బి ఆర్ ఎస్ పేరుతో ఓ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తే  కర్ణాటకకు  చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి తప్ప దేశంలో మరెవ్వరు శుభాకాంక్షలు కూడా తెలపనే లేదు. 

ఇప్పుడు రాజకీయ `సలహాదారుని’ పాత్ర వహిస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహితం కొత్త పార్టీని స్వాగతిస్తూ ఓ ట్వీట్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రత్యేకంగా వెళ్లి కలసిన మమతా బెనర్జీ, నితీష్ కుమార్,  శరద్ పవర్,  ఎం కె స్టాలిన్ వంటి వారు సహితం మౌనం వహించారు. 

ప్రతిష్టాకరమైన మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని ఓడించి, తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నందుకు బిజెపి వ్యతిరేక పార్టీలు ఏవీ కనీసం హర్షం ప్రకటించలేదు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే కేసీఆర్ రాజకీయ వ్యావహారాలు జాతీయ స్థాయిలో `విశ్వసనీయత’ను కోల్పోతున్నట్లు భావించవలసి వస్తుంది. 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు వరుసగా కర్ణాటక, తమిళనాడు,  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటించి వచ్చారు. కర్ణాటకలో మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఉంది. తమిళ్ నాడులో డీఎంకె  ప్రభుత్వం అనేక అంశాలపై కేంద్రంతో ఘర్షణ ధోరణి అవలంభిస్తోంది. రాష్ట్ర గవర్నర్ వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేసింది. 

అయినా, ప్రధాని మోదీ తమ రాష్ట్రానికి వస్తుంటే ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. పలు సందర్భాలలో ఢిల్లీకి వెళ్లి తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానికి విన్నవించుకున్నారు. మరోవంక, బీజేపేకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించారు. 

రాజకీయంగా బీజేపీతో పోరాటం చేస్తూనే, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని విధంగా వ్యవహరిస్తూనే రాజకీయంగా ప్రధాన మంత్రి పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల స్టాలిన్ ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సహితం వైసీపీతో బిజెపికి రాజకీయంగా ఎటువంటి పొత్తు లేదు. 

అయితే ప్రధాని పర్యటన ఏర్పాట్ల పట్ల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆసక్తి ప్రదర్శించారు. స్వయంగా ప్రధానికి గవర్నర్ తో కలసి స్వాగతం పలకడంతో పాటు, మర్యాదపూర్వకంగా ఆయన బస చేసిన అతిధి గృహంకు వెళ్లి కలిశారు. బహిరంగసభలో రాష్ట్రంకు సంబంధించిన సమస్యల జాబితాను ప్రధాని ముందు ఉంచారు.

కేసీఆర్ సహితం హుందాగా వ్యవహరించి, ప్రధానికి స్వాగతం పలికి ఉంటె, రామగుండం బహిరంగ సభలో ప్రధానితో కలసి పాల్గొని ఉంటె ఆయన ప్రతిష్టనే పెరిగి ఉండెడిది. ఆ విధంగా చేయకుండా ముభావంగా ఇంటికి పరిమితమై  ఉండిపోవడం గమనిస్తే ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కలిసి సమస్యలు వివరించే అవకాశం ఉన్నా కేసీఆర్ వినియోగించుకోలేదు. పైగా, ‘ప్రధాని గో బ్యాక్’ అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేయటం, అనుబంధ సంఘాలు, వామపక్షాలతో నిరసనలు చేయించడం గమనిస్తే ఎక్కడ రాజకీయ పోరాటం చేయాలో,  ఎక్కడ ఉండాగా వ్యవహరించాలో ఆలోచింపలేని దుస్థితిలో ఉన్నారా? అనే అనుమానం కలుగుతుంది.

ఈ ఏడాది మే 26న ఐఎస్‌బీ 20వ కాన్వొకేషన్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ  హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ ఇదే తీరుగా  ఫ్లెక్సీల ప్రచారం చేసింది. జులైలో  హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పాల్గొనేందుకు వచ్చిన సహితం ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బోర్డులు, హోర్డింగులతో ప్రచారం చేపట్టింది.

సమతా మూర్తి విగ్రహావిష్కరణకు మోడీ హాజరైనప్పటి నుంచే ప్రధాని ప్రధాని పర్యటనలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం ప్రారంభించారు. ఆ విధంగా వ్యవహరించడానికి కేసీఆర్ కు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ మర్యాదలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మాత్రం స్పష్టం అవుతున్నది. ఆ విధంగా చేయడం ద్వారా కేసీఆర్ సొంత పార్టీ శ్రేణులలో సైతం చులకన అవుతున్నారని గ్రహించాలి.