గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ

రాజ్ భవన్ లో గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తో గురువారం సాయంత్రం  దాదాపు 45 నిమిషాల పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై చర్చించారు. బిల్లుపై తమకు ఉన్న అనుమానాలను గవర్నర్ తమిళిసై మంత్రి సబితను అడిగి తెలుసుకున్నారు.
 
ముఖ్యంగా యూజీసీ నిబంధనలు, న్యాయపరమైన అంశాలను ప్రస్తావించారు. అన్నింటిని పూర్తిస్థాయిలో పాటిస్తున్నామని, భవిష్యత్తుల్లోనూ ఎటువంటి ఇబ్బందులు ఉండవని గవర్నర్ కు తెలిపారు. ప్రస్తుత విధానంలోని ఇబ్బందులు, కొత్త విధానం ద్వారా జరిగే లాభాన్ని కూడా గవర్నర్ కు వివరించారు. మంత్రి వెంట రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ తదితరులు ఉన్నారు.
 
కాగా, విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీలో యూజీసీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ స్పష్టం చేశారు. ఖాళీలను వీలైనంత త్వరగా.. పూర్తి పారదర్శకతతో, నిష్పాక్షికంగా భర్తీ చేయాలని, అర్హతల ఆధారంగా నియామకాలు చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డికి సూచించారు.
 
అయితే ఉమ్మడి నియామక బిల్లు తీసుకువచ్చే ముందు వర్సిటీలకు ఛాన్స్‌లర్‌ను అయిన గవర్నర్ సంప్రదించకపోవడం పట్ల తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌తో పాటు వైస్ ఛాన్స్‌లర్లను సంప్రదించి అందరి అభిప్రాయాలు తీసుకుని బిల్లు తీసుకు వస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
కొత్త విధానం అమలు ద్వారా న్యాయపరమైన, సాంకేతిక పరమైన సమస్యలు ఏమైనా వస్తాయా..? అర్హులకే ఉద్యోగాలు లభించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు..తదితర అంశాలపై మంత్రిని, అధికారులను గవర్నర్ అడిగినట్లు తెలిసింది.
 
యూనివర్సిటీలలో నియామాకాలు త్వరగా జరగాలన్నదే తమ అభిమతమని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యానే తాను ఈ బిల్లుపై వివరణ అడుగుతున్నట్టు ఆమె తెలిపారు. నియామకాల్లో యూజీసీ నిబంధనలను పాటించడంతోపాటు విశ్వవిద్యాలయాల్లోని హాస్టల్‌, లేబొరేటరీ, లైబ్రరీ సౌకర్యాలను, డిజిటల్‌ వనరులను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.
 
భేటీ సందర్భంగా ఈ బిల్లుపై గవర్నర్‌ కొన్ని సందేహాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా.. గతం లో ఉన్న పద్ధతి ప్రకారం నియామకాలను చేపట్టవచ్చు కదా? కమిటీల ద్వారా చేయడానికి అభ్యంతరమేమిటీ? కొత్తగా బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారు? తాజా నిర్ణ యం ద్వారా వర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినదా? యూజీసీ మార్గదర్శకాల ను పాటించారా? తదితర ప్రశ్నలను గవర్నర్‌ అడిగిన ట్టు సమాచారం.
 
దీనికి మంత్రి.. గత విధానంలో కొన్ని లోపాలున్నాయని.. వాటిని అధిగమించడానికే బోర్డును తీసుకొచ్చామని చెప్పినట్టు తెలుస్తోంది. యూజీసీ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే వర్సిటీలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బోర్డు ద్వారా నియామకాలను చేపట్టనున్నట్టు గవర్నర్‌కు వివరించారు.
 
అలాగే.. అన్ని వర్సిటీలకు ఉమ్మడిగా నియామకాలను చేపడితే రిజర్వేషన్లు దెబ్బతినవా? పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వంటి వాటితో నియామకాలను చేపట్టవచ్చు కదా అంటూ గవర్నర్‌ వ్యక్తం చేసిన సందేహంపై మంత్రి స్పందిస్తూ.. బోర్డు ద్వారా చేసే నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తామని, ఈ బోర్డు ద్వారా కేవలం టీచింగ్‌ సిబ్బందినే భర్తీ చేస్తామని, నాన్‌-టీచింగ్‌ ఖాళీలను టీఎ్‌సపీఎ్‌ససీ ద్వారానే భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
 
కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై సందేహాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యూజీసీకీ లేఖ రాశారు. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు 2022 బిల్లుపై చర్చించేందుకు రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాశారు.