విశాఖలో పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ భేటీ

రెండు రోజుల పాటు విశాఖపట్నం పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. శుక్రవారం, శనివారం విశాఖలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం విశాఖలో అందుబాటులో ఉండమని కోరుతూ ప్రధాన మంత్రి కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ కు సమాచారం అందింది.
 
దానితో శుక్రవారం రాత్రి గాని, శనివారం ఉదయం గాని ఇరువురు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బిజెపి- జనసేనల మధ్య నెలకొన్న పొత్తు విషయమై ఏర్పడిన అపోహలను తొలగించేందుకు ఈ భేటీ సహకార కాగలదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను కలిసే ముందు ప్రధాని రాష్ట్ర బిజెపి ముఖ్య నాయకులతో సహితం సమావేశం కానున్నారు.
 
దానితో జనసేనతో సంబంధాల విషయంలో రాష్ట్ర బిజెపి నాయకులకు ప్రధాని దిశానిర్ధేశం చేసే అవకాశాలున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో తిరుపతిలో రాష్ట్ర బిజెపి నాయకులతో సమావేశమైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహితం జనసేనతో సంబంధాల గురించి, అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం గురించి పలు సూచనలు చేశారు.
 
 బెంగుళూరు నుంచి నేరుగా విశాఖ వస్తున్న ప్రధాని  శుక్రవారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శుంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆంధ్రయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ పవన్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ లతో సమావేశం కానున్నారు. ప్రధానిని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకోనున్నారు. ఆదివారం వరకూ నగరంలోనే ఉంటారు.
 
2014 ఎన్నికల తర్వాత మోదీ, పవన్‌ ఇప్పటి వరకూ కలవలేదు. కొన్నాళ్ల కిందట భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు రావాలని పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. కానీ ఆహ్వానం ఆలస్యంగా అందడంతో పవన్‌ భీమవరం సభకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘకాలం తర్వాత శుక్రవారం వారిద్దరూ సమావేశం కానున్నారు.
 
మరోవంక, విశాఖలో వైసిపి నేతలు ఎవ్వరికీ ప్రధానిని విడిగా కలిసే అవకాశం లభించలేదని తెలుస్తున్నది. ప్రధాని పర్యటన కార్యక్రమాలను తమ సొంత పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకునేందుకు వైసిపి నేతలు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెడుతున్నట్లు కనిపిస్తున్నది.  ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయం, గిరిజన యూనివర్సిటీలకు భూమిపూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని కార్యాలయాన్ని (పీఎంవో) కోరినా అనుమతి లభించలేదని తెలుస్తున్నది.
 
మరోవంక, విశాఖలో ప్రధాని రాక సందర్భంగా విశాఖ విమానాశ్రయం నుంచి నగరంలోకి వెళ్లే దారిలో ఐటీఐ జంక్షన్‌ నుంచి కంచరపాలెం వరకూ ర్యాలీ నిర్వహించేందుకు పీఎంవో నుంచి బిజెపి నాయకులకు అనుమతి లభించింది. దీంతో బీజేపీ శ్రేణులు ఆ ప్రాంతమంతా పార్టీ జెండాలతో అలంకరించి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి.