దక్షిణాదిలో తొలి వందే భారత్ ఎక్స్‎ప్రెస్ రైలు ప్రారంభించిన ప్రధాని

చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ లో మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే కావడం విశేషం. 

ఇది దేశంలోని ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ బెంగళూరు మీదుగా చెన్నై, మైసూరు మధ్య సేవలు అందిస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచ స్థాయి ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన భారత దేశపు మొదటి సెమీ హైస్పీడ్ రైలు.  వందే భారత్ ట్రెయిన్ మైసూరు నుంచి వయా బెంగళూరు, కాట్పాడి మీదుగా చెన్నయ్‌కు నడుస్తుంది. ఇది వారంలో బుధవారం ఒక్క రోజు తప్పించి మిగతా ఆరు రోజులు నడుస్తుంది. 

చెన్నైలో ఉదయం 5.50కు బయలుదేరే ఈ రైలు బెంగళూరుకు ఉదయం 10.15కు, మైసూరుకు 12.20కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో మైసూరులో మధ్యాహ్నం 1.05కు బయలుదేరి బెంగళూరుకు మధ్యాహ్నం 2.50కు, చెన్నైకు రాత్రి 7.30కు చేరుకుంటుంది. చెన్నై ఇండస్ట్రియల్ హబ్‌కు, బెంగళూరు టెక్ అండ్ స్టార్టప్ హబ్‌కు మధ్య వారధిగా ఈ ఎక్స్‌ప్రెస్ నిలుస్తుందని పీఎంఓ తెలియజేసింది.

ఇది వేగవంతమైన యాక్సెలరేషన్‌, డీసెలరేషన్‌ అధిక వేగాన్ని అందుకోగలదు. ప్రయాణ సమయాలను 25 శాతం నుంచి 45 శాతం వరకు తగ్గిస్తుంది. ఈ రైలు 52 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.  అన్ని వందే భారత్ కోచ్‌లకు ఆటోమేటిక్ డోర్‌లు ఉంటాయి. జిపిఎస్ బేస్డ్‌ ఆడియో-విజువల్ ప్యాసెంజర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ కోసం ఆన్-బోర్డ్ హాట్‌స్పాట్ వైఫై సౌకర్యవంతమైన సీటింగ్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రొటేటింగ్‌ ఛైర్లు ఉంటాయి.

బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ కలిసి కర్ణాటక నుంచి కాశీకి యాత్రికులను పంపించేందుకు భారత్ గౌరవ్ పథకం కింద ఈ రైలును తీసుకువచ్చింది. 

కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ లను సందర్శించడానికి యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని రూపొందించారు. భారత్ గౌరవ్ రైలు బెంగళూరు నుంచి బయలుదేరి వయా హుబ్బల్లి, బెల్గావి, మిరాజ్, పుణే, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ మీదుగా వారణాసి చేరుకుంటుంది. ఇది సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని పరిచయం చేసే ఓ థీమ్ బేస్డ్ రైలు.

108 అడుగుల నాదప్రభు కెంపెగౌడ విగ్రహావిష్కరణ

తొలుత, బెంగళూరు నగర వ్యవస్థాపకుడు, నగరాభివృద్ధికి విశేష కృషి చేసిన నాగప్రభు కెంపెగౌడ 108 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. నాగప్రభు కెంపెగౌడ స్మారక్మార్థం ‘అభ్యుదయ విగ్రహం’ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 98 టన్నుల కాంస్యం, 12 టన్నుల స్టీల్ తో ప్రముఖ శిల్పకళాకారుడు రామ్ వి సుతార్  ఈ విగ్రహాన్ని తీర్దిదిద్దారు.
 
అంతకు ముందు,బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-2ను ప్రధాని ఈ సందర్భంగా ప్రారభించారు. రూ. 5 వేల కోట్లతో ఈ టెర్మినల్‌ నిర్మాణం జరిగింది.  కాగా, ప్రధాని బెంగళూరు పర్యటనలో భాగంగా తొలుత విధాన సౌధలోని కవి కన్నడదాస, మహర్షి వాల్మీకి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.