టీ20ల్లో నాలుగు వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ

అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో అడిలైడ్‌లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు.
 
ఇంగ్లండ్ తో మ్యాచ్ లో 42 పరుగులు చేసిన అనంతరం కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పుడు పురుషుల అంతర్జాతీయ టీ20 పోటీల్లో అత్యధిక పరుగుల వీరుడు కోహ్లీనే. ఇప్పటిదాకా 115 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 52.74 సగటు, 137.97 స్ట్రయిక్ రేట్ తో మొత్తం 4,008 పరుగులు సాధించాడు.
 
బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనె సాధించిన 1,016 పరుగులను అధిగమించాడు.
 
కోహ్లీ 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటు’ అవార్డు అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ కోహ్లీ అత్యధిక పరుగులతో అందరికంటే ముందున్నాడు. ఈ జాబితాలో టీమిండియా సారథి రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్, బాబర్ ఆజం, పాల్ స్టిర్లింగ్ కంటే కోహ్లీ చాలా ముందున్నాడు. ఈ ప్రపంచకప్‌లోనూ ఇప్పటి వరకు కోహ్లీదే అత్యధిక స్కోరు. ఆరు మ్యాచుల్లో కోహ్లీ 270 పరుగులు చేసాడు. 
 
కాగా,  టీ20 ప్రపంచకప్‌ మూడు సెమీఫైనల్స్‌లో హాఫ్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌ గా కూడా కోహ్లీ నిలిచారు.