గుజరాత్ అసెంబ్లి ఎన్నికలకు సంబంధించిన బీజేపీ ఒకేసారి 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు నిరాకరించింది. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబాతో సహా పలువురు కొత్తవారికి టికెట్లు ఇచ్చి బరిలోకి దించింది. బీజేపీ తొలి జాబితాలో 14 మంది మహిళలకు చోటు లభించింది.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, భూపేందర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో డిసెంబర్ 1న మొదటి దశ పోలింగ్ జరుగనున్న 89 నియోజకవర్గాల్లో 84 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా, డిసెంబర్ 5న జరుగనున్న రెండో దశ పోలింగ్ 93 స్థానాలకు గాను 76 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జామ్‌నగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనుంది. ఇక కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ విరామ్‌గాం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి మజురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీ, మరో ముగ్గురు సీనియర్లు అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు.
గుజరాత్‌లోని మోర్బీ నగరంలో గల మచ్చు నదిపై ఉన్న తీగల వంతెన కూలిపోవడంతో సుమారు 140 మంది మృతి చెందారు. దాంతో ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతియాను బరిలోకి దింపింది. ఆయన తీగల వంతెన దుర్ఘటన సమయంలో నదిలో దూకి పలువురి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేశ్ మెర్జాకు నిరాశ ఎదురైంది.
కాగా, రవీంద్ర జడేజా సతీమణి రివాబాకు బీజేపీ టికెట్ ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపాడు. తన అర్ధాంగి రివాబా పట్ల నమ్మకం ఉంచి ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చారంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. అటు రవీంద్ర జడేజా తన భార్య రివాబాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
”నువ్వు బీజేపీ తరఫున విధాన సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకోవడం పట్ల గర్విస్తున్నా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం, నీ ప్రయత్నాలు ఫలించాయి. సమాజ అభ్యున్నతి కోసం ఇకపైనా నీ కృషి కొనసాగిస్తావని ఆశిస్తున్నా” అంటూ జడేజా భార్యనుద్దేశించి వ్యాఖ్యానించారు.

More Stories
గవర్నర్ ను కలిసిన విజయ్ …. రేపే ప్రమాణం!
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!