కొలీజియం విధానం పారదర్శకంగా లేదని, జవాబుదారీతనంతో లేదని వస్తున్న విమర్శలను సానుకూల దృక్పథంతో పరిశీలించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. దానిని మరింత మెరుగుపరచడానికి కృషి చేయాలని సూచించారు.
న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ విధానం పారదర్శకంగా లేదని, జవాబుదారీతనం కొరవడిందని కిరణ్ రిజిజు విమర్శిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ప్రభుత్వం సృష్టించే వరకు ప్రస్తుత విధానంతోనే కొనసాగవలసి ఉంటుందని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడా న్యాయమూర్తులు నూతన న్యాయమూర్తులను నియమించరని కేంద్ర మంత్రి పేర్కొంటూ భారత దేశంలో మాత్రం అలా జరుగుతుందని చెప్పారు. నూతన న్యాయమూర్తుల నియామకం కోసం పేర్లను సిఫారసు చేయడానికి న్యాయమూర్తులు చాలా సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందని అంటూ ఈ ప్రక్రియలో చాలా రాజకీయాలు ఇమిడి ఉంటాయని చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోని న్యాయమూర్తులు చాలా ఎక్కువ పని చేస్తున్నారని, వారికి విరామం అవసరమని కేంద్ర మంత్రి సూచించారు. ఈ విషయమేమి స్పందిస్తూ, ఆ వ్యవస్థలోనే మనం పని చేస్తున్నామని, అదే సమయంలో, తాను ఎటువంటి లోపాలు లేకుండా, ఆదర్శవంతంగా ఉన్నట్లు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక దేశాల్లోని ఏ వ్యవస్థా చెప్పుకోజాలదని చంద్రచూడ్ స్పష్టం చేశారు.
అందువల్ల కొలీజియం వ్యవస్థలో మనం మెరుగుపరచదగిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. కాబట్టి ఇది నిరంతరం పరివర్తన చెందే ప్రక్రియ అని తాను భావిస్తున్నానని చెప్పారు. న్యాయమూర్తుల నియామకం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అనుకోవడంలో ఔచిత్యం ఉందని, దీనిలో ప్రజాప్రయోజనం కూడా ఉందని అంటూ ఇది సమర్థించదగినదేనని పేర్కొన్నారు.
అయితే న్యాయమూర్తుల నియామకం కోసం పరిశీలనలో ఉండే హైకోర్టుల న్యాయమూర్తులు, బార్ సభ్యుల వ్యక్తిగత గోప్యతను కూడా కాపాడవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
కొలీజియంలో జరిగే చర్చలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ బయటకు చెప్పడం, ప్రజల తనిఖీకి పెట్టడం మొదలు పెడితే, వచ్చే నికర ఫలితం ఏమిటంటే, న్యాయమూర్తి పదవిని ఇవ్వజూపినపుడు చాలా మంది సమర్థులు దానిని స్వీకరించడానికి ఆసక్తి చూపబోరని, దానిని కోరుకోరని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
వ్యవస్థ ప్రయోజనాలకు లేదా అవసరాలకు వాస్తవంగా సంబంధం లేని తనిఖీ స్థాయికి అత్యంత వ్యక్తిగత జీవితాలను వెల్లడించవలసి వస్తుందనే భావం కలుగుతుందని చంద్రచూడ్ చెప్పారు. తీర్పుల్లో రాసే మాటలు, న్యాయమూర్తులుగా పనితీరు మాత్రమే లెక్కలోకి వస్తాయని తాను నమ్ముతానని చెప్పారు. విమర్శలతో వ్యవహరించవలసిన ఉత్తమమైన మార్గం ఏమిటంటే, కొలీజియం పని తీరుపై వచ్చే వైవిద్ధ్యభరితమైన విశ్లేషణల పట్ల మరింత ఓర్పుతో కూడిన పద్ధతిలో పని చేయడమేనని చెప్పారు.
కొన్ని విమర్శలు సంపూర్ణంగా సమర్థనీయం కాకపోవచ్చునని, మరికొన్ని విమర్శలు మన విధానాలను ఏవిధంగా మెరుగుపరచుకోవచ్చునో పరిశీలించుకోవడాన్ని ప్రోత్సహించవచ్చునని ఆయన సూచించారు. దీనిని తాము చేస్తామని చెప్పారు. అయితే మార్పు అనేది క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లుగా జరుగుతుందని తెలిపారు. స్థిరత్వాన్ని, కచ్చితత్వాన్ని, ప్రతి ఒక్కరికీ మెరుగైన ఫలితాలను ఇచ్చే విధంగా ఈ మార్పు జరుగుతుందని వివరించారు.
More Stories
భారత్ బలం అద్భుతమైన ఏకీకృత స్ఫూర్తిలోనే ఉంది
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు
భారత మహిళల అండర్-19 జట్టు తొలి విజయం