ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ మరోసారి అసత్యాలు ప్రచారం  

ఎరువుల ఫ్యాక్టరీపై కేసీఆర్ మరోసారి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అయితే కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా విజ్ఞత గల తెలంగాణ ప్రజలు నమ్మబోరని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు.  
గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి జాతికి అంకితమిచ్చే నిమిత్తం నవంబర్ 12న వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామగుండం పర్యటనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, తన కొత్త మిత్రులు సీపీఐ, సీపీఎంలతో కలిసి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
 ఎరువుల ఫ్యాక్టరీ తెరవడాన్ని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఈ కర్మాగారం వల్ల తెలంగాణ రైతులకే కాకుండా యావత్ దేశానికి విశేష ప్రయోజనం కలుగుతుందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం ఆయన గుర్తించాలని హితవు చెప్పారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆయన కానీ, ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు.
నరేంద్ర మోదీ  చొరవ తీసుకుని రూ. 6,500 కోట్లతో ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నారని చెబుతూ  తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ అంటున్నారని తరుణ్ ఛుగ్ విస్మయం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి, రాష్ట్రంలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,511 కి.మీ.లు. ఇప్పుడు 4,996 కి.మీ.లకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
2014-2022 కాలంలో కొత్తగా 2,485 కి.మీ.లు జాతీయ రహదారులు నిర్మించారని చెబుతూ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివిలో 99 శాతం వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. ఇంకా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ అంబర్‌పేట్ వద్ద రూ.186.71 కోట్లతో 4-లేన్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. ఉప్పల్ నుండి నారపల్లి వరకు రూ.628.8 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మిస్తోందని వివరించారు.
రైల్వేల్లోనూ తెలంగాణకు కేంద్రం కేటాయింపులు భారీగా పెరిగాయని బిజెపి నేత స్పష్టం చేశారు. 2014-19లో ప్రతి సంవత్సరం సగటున రూ.1,110 కోట్ల కేటాయింపులు జరిగేవని, అయితే రూ.4,200 కోట్లతో కేంద్రం పలు అభివృద్ధి పనులు చేపట్టినా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.699 కోట్లు చెల్లించడం లేదని తరుణ్ ఛుగ్ తెలిపారు. 
 
2014-21 కాలంలో రాష్ట్రంలో 177 కిలోమీటర్ల పొడవు మేర రైల్వే లైన్లు నిర్మాణమయ్యాయని ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రూ.31,281 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులను రైల్వేశాఖ చేపట్టిందని పేర్కొన్నారు. 
 
పైగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కేంద్రం భాగస్వామ్యం ఉందని బిజెపి నేత స్పష్టం చేశారు. తెలంగాణలో రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతున్న కేసీఆర్ నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. మునుగోడులో ఆశించిన భారీ మెజారిటీ దక్కకపోవడంతో, రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమవడంతో, కేసీఆర్ ఆందోళనలో కూరుకుపోయారని పేర్కొన్నారు.
కేసీఆర్ కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్న కాలంలో రాష్టానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.