
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైనగోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పాటు, ఆయనపై ప్రయోగించిన పీడీయాక్టు కేసు ఎత్తివేయడంతో బుధవారం రాత్రి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు.
బుధవారం సాయంత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయగానే రాజాసింగ్ భార్య ఉషాభాయి న్యాయవాదులతో కలిసి జైలుకు వెళ్లారు. అప్పటికే బెయిల్ ఆర్డర్ ఆన్‌లైన్ ద్వారా జైలు అధికారులకు చేరడంతో నిమిషాల వ్యవధిలోనే రాజాసింగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
హైకోర్టు షరతుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రాజసింగ్పై హైకోర్టు పీడీయాక్టును ఎత్తేయటంతో బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు టపాసులు కాల్చారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. తీన్మార్ డ్యాన్సులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు రాజాసింగ్ బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడకుండా, అభివాదం చేస్తూ జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. రాజాసింగ్ విడుదల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుషాయిగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు అర కిలోమీటర్ వరకు ఎవరూ గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే, వాహనంలో వెళ్తున్న రాజాసింగ్‌ను చూసి అభిమానులు చేసిన ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడంతో ఆ పరిసరాలు హోరెత్తాయి. రాజాసింగ్ విడుదలతో మంగళ్‌హాట్‌లోని రాజాసింగ్ ఇంటి వద్ద ఆయన బంధువులు, స్నేహితులు సంబురాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.
పీడీ యాక్టును ఎత్తివేయడంతో పాటు, బెయిల్ మంజూరు కావడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ధర్మం విజయం సాధించిందని ట్విట్టర్ లో తెలిపారు. మరోసారి మీ సేవకు పాత్రున్ని కాబోతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాముడు విగ్రహంతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదంతో తాను జైలు నుంచి క్షేమంగా బయటకు వచ్చినట్లు పేర్కొంటూ జైలు నుంచి విడుదలైన అనంతరం రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నా అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా ఽకృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అందులో పేర్కొన్నారు.
More Stories
మరోసారి స్మిత అగర్వాల్ ట్వీట్ తో ఇరకాటంలో ప్రభుత్వం!
మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ ఛైర్పర్సన్గా సీఎస్ శాంతికుమారి