
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారులు బుధవారం చేపట్టిన సోదాలలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్, ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు. దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి 10 గంటల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించారు.
మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేసిన ఈడీ.. కరీంనగర్, హైదరాబాద్‌లో సోదాలు చేస్తోంది. ఈ సందర్భంగా కరీంనగర్ లోని గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించారు. గంగుల తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం దుబాయిలో పర్యటిస్తున్నారు. ఐటీ, ఈడీ అధికారులు తన ఇంటిపై దాడి చేశారన్న వార్త తెలియగానే… ఆయన దుబాయి నుంచి గత రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.
గతంలో ఈడీ నోటీసులు జారీ చేసిన కంపెనీల్లో దాడులు జరుగుతున్నాయి. కరీంనగర్ లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలోని కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహావీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ సోదాలు జరిపారు.
గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే తెలంగాణకు చెందిన 8 సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలు మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందాయి. అయితే ఫెమా నిబంధనలకు విరుద్దంగా పరిధికి మించి ఈ సంస్థలు తవ్వకాలు జరిపారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు జరుగుతున్నాయి.తాజాగా ఆదాయపన్ను శాఖ అధికారులతో కలిసి ఈడీ దాడులు చేయడం గమనార్హం.
పదేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన ఎనిమిది గ్రానైట్ కంపెనీలు విదేశాలకు గ్రానైట్ రవాణాలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లజేశారని ఆరోపణలు వచ్చాయి. 2013లో విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌శాఖ ఈ వ్యవహారంలో విచారణ జరిపించి ఆయా కంపెనీలు తప్పుడు కొలతలతో సుమారు రూ. 125 కోట్ల విలువచేసే గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేశాయని తేల్చి ,ఇందుకుగాను ఐదు రెట్ల ఫెనాల్టీని విధించింది. రూ. 749. 64 కోట్లు చెల్లించాలని నోటీసులను ఈడీ జారీ చేసింది.
More Stories
ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం