రెండు నెలల్లో పది వేల కేసులను పరిష్కరించిన జస్టిస్ లలిత్ 

రెండు నెలల్లో పది వేల కేసులను పరిష్కరించిన జస్టిస్ లలిత్ 
గత రెండు నెలల్లో దాదాపు పది వేల కేసులను పరిష్కరించినట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌ తెలిపారు. సిజెఐగా మంగళవారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌  లలిత్‌కు సోమవారం  సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ జరిగింది. మంగళవారం గురునానక్‌ జయంతి సందర్భంగా సుప్రీం కోర్టుకు సెలవు కావడంతో సోమవారమే ఆయన చివరి పని దినం అయింది.
 
ఈ సందర్భంగా జస్టిస్‌ లలిత్‌ మాట్లాడుతూ ”నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 8,700 పిటిషన్లు దాఖలు అయ్యాయి. 10,000 కేసులను పరిష్కరించాం. లోపాలతో ఉన్న 13,000 కేసులు పరిష్కరించాం” అని పేర్కొన్నారు. 
 
ఆగస్టు 27న సిజెఐగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల లిస్టింగ్‌ను క్రమబద్ధీకరించడంతోపాటు రాజ్యాంగ ధర్మాసనాలను రోజూ కూర్చోబెట్టడాన్ని కొంతమేరకు సాధించగలిగానని చెప్పారు. సుప్రీం కోర్టులో తాను దాదాపు 37 ఏళ్లుగా ప్రాక్టీస్‌ చేశానని, ఏకకాలంలో రెండు రాజ్యాంగ ధర్మాసనాలు కూర్చోవడం ఎప్పుడూ చూడలేదని తెలిపారు. 
 
 తాను సిజెఐ అయిన తరువాత ఒకే రోజు మూడు రాజ్యాంగ ధర్మాసనాలు విచారించాయని ఆయన గుర్తు చేశారు. లైవ్‌ స్ట్రీమింగ్‌లో విచారణలు జరిగాయని చెబుతూ ఈ గొప్ప విజయంతో తాను సంతృప్తితో వెళ్తున్నానని తెలిపారు. సుప్రీంకోర్టులో లాయర్‌గా తన తొలి కేసును జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌ బెంచ్‌ ముందు వాదించానని, ఇప్పుడు ఆయన కుమారుడు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు సీజేఐగా బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
 
 సిజెఐగా నియమితులైన జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ మాట్లాడుతూ తన కుటుంబానికి, సిజెఐ లలిత్‌ కుటుంబానికి మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిజెఐ లలిత్‌ సుప్రీం కోర్టును వలసరాజ్యాల సంస్థ నుంచి ప్రజలకు చేరువయ్యే సంస్థగా మార్చారని కొనియాడారు. 
 
అంతకుముందు సుప్రీం కోర్టులో సెరిమోనియల్‌ ధర్మాసనం జరిగింది. ఇందులో సిజెఐ జస్టిస్‌ యుయు లలిత్‌, సాంప్రదాయం ప్రకారం కాబోయే సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌తో కూర్చున్నారు. ఈ బెంచ్‌లో లలిత్‌ చివరి డివిజన్‌ బెంచ్‌ సభ్యురాలు జస్టిస్‌ బేల ఎం. త్రివేది కూడా కూర్చున్నారు. 
 
అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, మాజీ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌, సుప్రీం కోర్టు న్యాయవాదులు పాల్గన్నారు.ఈ ఏడాది ఆగస్టు 27న 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ లలిత్‌ 74 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు.