అభ్యర్థి ఓడినా గణనీయంగా పెరిగిన బిజెపి ఓటు బ్యాంకు

ఎంతో భరోసాతో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో శాసనసభ్యత్వంకు రాజీనామా చేయించి, ఉపఎన్నికకు కాలుదువ్విన బిజేపికి మునుగోడులో అనూహ్యంగా పరాజయం ఎదురైనా దాదాపు అన్ని రౌండ్లలో గట్టి పోటీ ఇవ్వగలగడంతో కొంత సంతృప్తి ఇవ్వగలిగింది. పైగా, మొత్తం తెలంగాణాలో కాంగ్రెస్ కు బలమైనదిగా భావించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్ధికి డిపాజిట్ దక్కక పోవడంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ ను ఢీకొనగలిగే శక్తీ కేవలం బిజెపికి మాత్రమే ఉన్నదన్న సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన్నట్లయింది.
దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తామేనని మరోసారి బీజేపీకి రుజువు చేసుకుంది. ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకుని రాబోయే ఎన్నికల్లో దీటుగా తలపడడానికి రంగం ఏర్పాటు చేసుకో గలిగింది. తమకు ఏ మాత్రం పట్టులేని నల్లగొండ జిల్లాలో, అందులోనూ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల కంచుకోట మునుగోడు నియోజక వర్గంలో భారీగా ఓట్లను సాధించి పట్టు బిగించింది.  హోరాహోరీ పోరులో ప్రతి రౌండ్‌లోనూ నువ్వా నేనా అన్నట్లు ఓట్లను తెచ్చుకుని అధికార పార్టీకి దీటుగా నిలిచింది.
ఇక్కడ గెలిచి ఉంటే  హ్యాట్రిక్‌ విజయాలతో పూర్తిస్థాయి ఆత్మ విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఉండేది. స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో ఇప్పుడు ఆత్మ విశ్వాసం కాస్త తగ్గినా, తమకు పట్టులేని ప్రాంతంలో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించడం కచ్చితంగా ఆ పార్టీ కలిగిస్తున్నది.
చివరి వరకూ పోరాడి, గెలుపు ముంగిట తడబడినా.. ఈ ఉప ఎన్నిక ఫలితం బీజేపీ క్యాడర్‌లో స్థైర్యం నింపుతున్నది.
నిజానికి, గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ సాధించిన ఓట్లు కేవలం 12,725 మాత్రమే. నాలుగేళ్ల వ్యవధిలోనే దాదాపు ఏడు రెట్లు అధికంగా ఇక్కడ ఓట్లను సాధించింది.  దక్షిణ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అంతగా పట్టు లేదనే అభిప్రాయం ఇప్పటి వరకూ ఉంది. తాజా ఎన్నికతో ఆ అభిప్రాయం పటాపంచలు అవుతుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
మునిసిపల్‌ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోటాపోటీగా ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా తమ పార్టీ చొచ్చుకొని వెళ్లిందని చెప్పడానికి మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లు ప్రతీకలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
‘‘మాకు గట్టి పట్టున్న చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో ఆశించిన మేర మెజారిటీ సాధించలేకపోయాం. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో లోపం కారణంగానే పట్టున్న ప్రాంతాల్లోనూ మెజారిటీ రాలేదు. అనూహ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు స్పందించారు” అని పేర్కొంటున్నారు.
సీఎం సైతం ఒక గ్రామానికి ఇన్‌చార్జిగా వ్యవహరించినా అధికార పార్టీ పెద్ద మెజారిటీ సాధించలేకపోవడానికి బీజేపీ ప్రచార వ్యూహమే కారణం అని చెప్పవచ్చు.  “ఉప ఎన్నికలో మా అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవచ్చు. కానీ, బీజేపీ గెలిచింది’’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. 
 
సర్వ శక్తులూ ఒడ్డినా అధికార పార్టీ అత్తెసరు మెజారిటీకే పరిమితం కావడంతో రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఊహించిన దానికన్నా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడి చేసిన్నట్లు భావిస్తున్నారు. 
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని నియోజక వర్గాల్లోనూ బలమైన నాయకులు ఉంటే టిఆర్ఎస్ కు  ముచ్చెమటలు పట్టించి కాషాయ జెండా ఎగరేయడం సాధ్యమనే బలమైన స్ఫూర్తిని ఈ ఫలితాలు బిజెపి శ్రేణులకు కలిగిస్తున్నాయి.  బలమైన నాయకులతోపాటు ఇతర పార్టీల క్యాడర్‌ కూడా తమ  వెంట వచ్చేటట్లు చేసుకో గలిగితే తమ గెలుపు నల్లేరుపై బండి నడక అవుతుందని ధీమా వ్యక్తం అవుతున్నది. 
 
గత ఎన్నికలతో పోలిస్తే  దాదాపు అన్ని వర్గాల్లోనూ బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకో గలిగింది. మరీ ముఖ్యంగా, యువత ఈసారి బిజెపి వైపు విశేషంగా ఆకర్షితులయ్యారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ యువకులు తమవైపు నిలిచారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 
 
 వివిధ కారణాలతో కొంతమంది వృద్ధులు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైపు ఆసక్తి చూపినా, వారి పిల్లలు ఒత్తిడి చేసి తమ వైపు వారు ఆకర్షితులయ్యేలా ప్రభావితం చేశారని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడానికి ఇదొక కారణమని చెబుతున్నారు.