‘మురసొలి’ వ్యాసాలపై తమిళనాడు, తెలంగాణ గవర్నర్ల మండిపాటు

డీఎంకే అధికార పత్రికలో తమను విమర్శిస్తూ వస్తున్న వ్యాసాల పట్ల తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు మండిపడుతున్నారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ తమిళిసై స్టాలిన్‌ నేతృత్వంలోని ఇటీవలి కాలంలో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 
దీంతో వారిద్దరి వైఖరినీ తూర్పారబడుతూ డీఎంకే అధికార పత్రిక అయిన ‘మురసొలి’లో ‘‘గవర్నర్లూ! అగ్ని పర్వతాలతో చెలగాటం వద్దు’’ శీర్షికన ఓ వ్యాసం ప్రచురితమైంది. ఈ పత్రికలో నిరసనగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కోయంబత్తూరు పేలుడుపై ఓ సభలో తాను ప్రసంగించిన వీడియోను మరోమారు విడుదల చేశారు.
గవర్నర్‌ రవిని రీకాల్‌ చేయాలంటూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించేందుకు డీఎంకే, దాని మిత్రపక్షాలు సన్నాహాలు చేస్తున్న వేళ గవర్నర్‌ రెండోమారు రాజ్‌భవన్‌ వెబ్‌సైట్‌ నుంచి వీడియో విడుదల చేయడం పట్ల అధికార పార్టీ నేతలు రగిలిపోతున్నారు. అక్టోబరు 28న కోయంబత్తూరులోని యోగా సంస్థ కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగించారు.
కోవైలో దీపావళికి ముందురోజు జరిగిన కారు పేలుడు ఘటన ఉగ్రవాద చర్యేనని ప్రకటించారు. పేలుడుపై ఎన్‌ఐఏకి విచారణ అప్పగించకుండా జాప్యం వహించారని పోలీసుల తీరునూ తప్పుబట్టారు. పేలుడు ఘటన వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉందని కూడా ఆరోపించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో అదే రోజు రాజ్‌భవన్‌ వెబ్‌సైట్‌ నుంచి అన్ని ప్రసారమాధ్యమాలకు విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్‌ రవి కోయంబత్తూరు పేలుడు సాకుగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ డీఎంకే పత్రిక ‘మురసొలి’లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అదే సమయంలో డీఎంకే సీనియర్‌ నేతలు గవర్నర్‌ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
రేపోమాపో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును డీఎంకే ఎంపీలు కలుసుకుని గవర్నర్‌ను రీకాల్‌చేయాలని వినతి పత్రం సమర్పించనున్న నేపథ్యంలో ఊహించని విధంగా కోవై పేలుడు ఘటనపై విచారణ తీరును తప్పు పడుతూ గతంలో చేసిన ప్రసంగాన్ని గవర్నర్‌ సోమవారం మరోమారు విడుదల చేశారు.
మరోవంక, తెలంగాణకు గవర్నర్‌గా ఉన్న డా. తమిళిసై సౌందరరాజన్  ను అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆమె చెన్నైలోనే కాలం గడుపుతున్నారంటూ డీఎంకే ఆ వ్యాసంలో ఎద్దేవా చేసింది. దీనిపై తమిళిసై ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.
‘‘తెలంగాణలో ఏమి జరుగుతోందో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ తమిళ వేషం వేసినవారు.. గవర్నర్‌గా తెలంగాణ శాసనసభలో తమిళంలో తిరుక్కురళ్‌ సూక్తిని పఠించిన తమిళ వనితను నేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
“గత మూడేళ్లుగా తెలంగాణ స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఎవరు భయపడుతున్నారో? ఎవరు ధైర్యంగా ఉన్నారో మీకు తెలుస్తుంది. నాకు సమాధానం చెప్పడానికి పాలకులు, కుటుంబవారసులు, మంత్రులు కంకణం కట్టుకుని బారులు తీరి నిలిచి ఉండటమే ఇందుకు సాక్ష్యం” అంటూ ఆమె పేర్కొన్నారు.
“నేను చేతులు ముడుచుకుని ఉన్నట్లు కలలు కంటున్నారా? తెలంగాణలో ఫామ్‌హౌ్‌సలో జరిగే వారసత్వ రాజకీయాలతో కూడిన ప్రభుత్వం గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడం వల్లనే వారికి రాజ్‌భవన్‌పై కోపం. మిమ్మల్ని మీరు అగ్ని పర్వతాలుగా ప్రకటించుకోవడం చాలా సంతోషం. అదే సమయంలో ఆ అగ్ని పర్వతాలు హిమాలయాలను ఏమి చేయలేవనే వాస్తవాన్ని గమనించాలి” అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
“మురసొలి తాటాకు చప్పుళ్లకు మేం భయపడం. ఉరుములు, మెరుపులు, పిడుగులే మమ్మల్ని ఏం చేయనప్పుడు కేవలం మురసొలి (ఢంకా నాదం) మమ్మల్ని ఏం చేయగలదు? సాలెపురుగులు సింహాలను ఏం చేయగలవు?’’ అంటూ డా. తమిళశై నిప్పులు చెరిగారు.