అద్వానీకి మోదీ, రాజ్‌నాథ్ సింగ్ జన్మదిన శుభాకాంక్షలు

బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (95) జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ  బిజెపి కురు వృద్ధుడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయనకు గులాబీ పూల పుష్పగుచ్ఛాలను ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ నివాసంలో ఆయనతోపాటు మోదీ సుమారు 30 నిమిషాలపాటు ఆహ్లాదంగా గడిపారు. ఇరువురు ముచ్చటించుకున్నారు. అంతకుముందు వీరికి అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీ స్వాగతం పలికారు.
 
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన ట్వీట్‌లో, అద్వానీ తన జీవితాన్ని దేశానికి, సంస్థకు అంకితం చేశారని, అది తమకు ప్రేరణనిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ నిరంతర శ్రమతో దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేశారని కొనియాడారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకులు అద్వానీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అద్వానీ 1927 నవంబరు 8న ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన అనంతరం ఆయన కుటుంబం ముంబైకి వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 2002 నుంచి 2004 మధ్య కాలంలో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధాన మంత్రిగా పని చేశారు. 

గడచిన మూడు దశాబ్దాల్లో బీజేపీ ఎదుగుదల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. లోక్‌సభలో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండే పరిస్థితి నుంచి 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీని తీర్చిదిద్దిన ఘనతలో ఆయన ప్రధాన భాగస్వామి. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న డిమాండ్‌తో ఆయన రథయాత్ర నిర్వహించారు. 

రాజస్థాన్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  ప్రచారక్ గా పని చేశారు. తదనంతరం జన సంఘ్ లో చేరిన అద్వానీ,  జన సంఘ్ ను బిజెపిగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. ఆయన ఢిల్లీ, గుజరాత్‌ల నుంచి ఎన్నికల్లో గెలిచారు. అద్వానీకి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి 2016లో మరణించారు. భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది.