ఉప ఎన్నికలో ప్రజలు తీర్పును శిరసావహిస్తాం

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.  ఓడిపోయినా..గెలిచినా ప్రజల కోసమే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అయితే మునుగోడు గెలుపు కొందరు పోలీసులు, ఎన్నికల కమీషన్ దే అంటూ ధ్వజమెత్తారు. 
 
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు,  ఎంపీ డా. కె. లక్ష్మణ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ  కేవలం 11 వేల ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారని చెబుతూ నల్గొండలో బీజేపీ లేదన్న వారు ఈ ఫలితాన్ని చూసైనా వాస్తవాన్ని గ్రహించాలని హితవు చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు ఎక్కడా నిరుత్సాహానికి గురి కాలేదని, బీజేపీ భయపడలేదని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నేతలు మద్యం పోసినా, డబ్బు పంచినా.. వాళ్లపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. అంబులెన్స్ లు, ప్రభుత్వ వాహనాల్లో డబ్బులు తరలించారని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార పార్టీ రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని, అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో మరో 12 చోట్ల ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమా?  అని  సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ఓ రకంగా యుద్ధం చేశారని, ప్రజల కోసం ఆయన తపన పడుతారని సంజయ్ కొనియాడారు.  టీఆర్ఎస్ వాళ్లు ఓటుకు రూ. 5 వేలు ఇవ్వడంతో పాటు.. భారీగా మద్యం పంచారని ఆరోపించారు.
టీఆర్ఎస్ కు సంబంధించిన డబ్బులను పోలీసులు  పట్టుకోలేదని ధ్వజమెత్తారు.  కాంగ్రెస్ పేరిట  టీఆర్ఎస్ డబ్బులు పంచిందని అంటూ ఇదంతా చూస్తున్న జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు.  
 
 టీఆర్ఎస్ అరాచకాలను అడ్డుకొనే పార్టీ బీజేపీయేనని ప్రజలు గుర్తించారని, అందుకే ఆశీర్వదిస్తున్నారని సంజయ్ చెప్పారు.    మునుగోడుకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం 15 రోజుల్లో అమలు చేయాలని ఆయన  డిమాండ్ చేశారు.  ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఖతమైనదని, సిట్టింగ్ స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయినదని విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం అయినట్లేనని డా. లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని, ఒక్క ఓటమితో కుంగిపోయే పార్టీ బీజేపీ కాదని అంటూ ఓటమిని పాఠంగా స్వీకరించి రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని, కాంగ్రస్ పతనానికి ఇది అద్దం పడుతోందని చెప్పారు. దేశంలో ఇవాళ వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రస్ తన రెండు స్థానాలను కోల్పోయిందని తెలిపారు.