మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగించింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి సమీప బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై  10,297 ఓట్ మెజార్టీ సాధించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి డిపాజిట్ కోల్పోయింది.  మొత్తం 15 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరుగగా 2వ, 3వ, 15వ  రౌండ్లలో  మినహా మిగిలిన అన్ని రౌండ్లలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతలో కొనసాగుతూ వచ్చారు.

అయితే బిజెపి అభ్యర్థిపై ప్రతి రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత చాలా తక్కువగా ఉండడం గమనార్హం. తొలి రౌండ్ నుంచి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు నడిచింది. రౌండ్ రౌండ్ కు నువ్వా..నేనా అన్నట్టు పోరు సాగింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన కారు పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది.

 టిఆర్ఎస్ అభ్యర్థికి  97,334ఓట్లు రాగా, బిజెపి అభ్యర్ధికి  86,275, కాంగ్రెస్ అభ్యర్ధికి 21,243 ఓట్లు వచ్చాయి.  2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జరుగగా ఆ మూడింటింటిలోనూ టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 686 పోల్ అయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 228, బీజేపీకి 224, బీఎస్పీకి 10, ఇతరులకు 88 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నికలు ఈనెల 3న జరగగా, రికార్డు స్థాయిలో 93.13శాతం పోలింగ్‌ నమోదైంది. 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. క‌నీసం డిపాజిట్‌ను కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. 15 రౌండ్ల‌లో ఏ ఒక్క రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి రౌండ్ వ‌ర‌కు మూడో స్థానంలోనే ఉండిపోయింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ పార్టీ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి.. కౌంటింగ్ కేంద్రం నుంచి ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలోనే వెళ్లిపోయింది. ఇక ఆ త‌ర్వాత కౌంటింగ్ కేంద్రం వైపు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. 

మునుగోడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నా..హస్తం పార్టీకి మైలేజ్ తీసుకురాలేకపోయాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా ..పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే సాగింది. కమ్యునిస్టులు టీఆర్ఎస్ తో కలిసి రావడం బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో ఆ పార్టీ అగ్రనేతలు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.