మాజీ మంత్రి డా. వై.ఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, ప్రముఖ వైద్యులు డా. నర్రెడ్డి సునీత క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. న్యాయ, వైద్యం, సైన్యం, ఆర్థిక, కళా రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్, జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయసేవల విభాగంతో కలిసి ఆదివారం ఢిల్లీలో జాతీయ అవార్డులు ప్రదానం చేసింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ యుయు లలిత్ డాక్టర్ నర్రెడ్డి సునీతకు జాతీయ అవార్డును అందజేశారు. ఆమె వైద్య రంగంలో చేసిన సేవలకు గానూ క్యాపిటల్ ఫౌండేషన్ ఈ పురస్కారం ప్రదానం చేసింది. మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు జీవన సాఫల్య పురస్కారం, హైదరాబాద్‌కు చెందిన పురాతన కార్ల సేకర్త (కళా రంగం) రామ్‌లాల్ అగర్వాల్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని జస్టిస్ యుయు లలిత్ అందజేశారు.
వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 15 మందికి జాతీయ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ జస్టిస్ ఎకె పట్నాయక్, అటార్నీ జనరల్ వెంకటరమణి, వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు, బిజెడి రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్రా, పలువురు మాజీ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.
కాగా, టిబితోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ప్రముఖ వైద్యురాలు డా. నర్రెడ్డి సునీత తెలిపారు. జాతీయ పురస్కారం అందుకున్న తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో టిబి, డెంగీ, హెచ్‌ఐవి లాంటి అంటువ్యాధుల విషయాన్ని అంతా విస్మరించారని తెలిపారు.
టిబి వేల సంవత్సరాలుగా ఉన్నా నేటికీ చికిత్స అందించడం సవాల్‌గానే ఉందని ఆమె తెలిపారు. 15 ఏళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం టిబి చికిత్సలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. టిబి రోగులకు చేయూతనివ్వాల్సి ఉంటుందని పేర్కొంటూ టిబి వ్యాప్తిని అరికట్టగలిగితే సమాజానికి ఎంతో మేలు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం డెంగీపై పరిశోధనలు సాగుతున్నాయని ఆమె చెప్పారు.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు