కేటీఆర్ ఆరోపణలపై వివేక్ ఆగ్రహం 

మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కేటీఆర్ తనపై చేసిన ఆరోపణల పట్ల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక్‌ ఒక హవాలా ఆపరేటర్‌ మాదిరిగా అక్కడ రూ. 25కోట్లు, ఇక్కడ రూ.75 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఎవరికోసం ఇంత సొమ్ము ఇస్తున్నారు? అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 

తమపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ కోకాపేటలో తమ కంపెనీ కోసం ల్యాండ్ కొనుగోలు చేస్తే .. హవాలా లావాదేవీలు జరిగాయాంటూ కేటీఆర్ తప్పుడు ప్రకటన చేశారంటూ మండిపడ్డారు. కంపెనీ కోసం తాము భూమి కొనడం తప్పా? అని ప్రశ్నించారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాను డబ్బులు ఇచ్చానని కేటీఆర్ ఆరోపించడాన్ని తప్పుపట్టారు. జమునా హచరీస్ పైనా కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ నుంచి తనకు రెండున్నర కోట్లు వచ్చాయని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర పోలీసులతోనూ విచారణ చేయించుకోవచ్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు. ఫస్ర్టేషన్ లో కేటీఆర్ తమపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఓ విఫల నేత అంటూ ధ్వజమెత్తారు. 

మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే అని వివేక్ స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల, పోలీసుల సహకారంతో టీఆర్ఎస్ గెలిచిందని పేర్కొన్నారు. పోలింగ్ రోజు కూడా ఇతర నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడులోనే తిష్టవేసి, విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు. 

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును కేటీఆర్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని అంటూ ప్రలోభాలతోనే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారు. ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులను తమకు ఇష్టం వచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు వాడుకున్నారని చెప్పారు. కమ్యూనిస్టుల ఓట్లు, పోలీసుల సపోర్టు లేకపోతే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచేది కాదని స్పష్ష్టం చేశారు. 

తమ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోనివ్వకుండా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ మునుగోడులోనే తిష్టవేసి, క్యాంపెయిన్ చేశారని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు. ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. 

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్ఎస్ మనుగడ లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ చేయలేదని, ఒకవేళ సీఎంగా కేటీఆర్ ను చేసి ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 65 నుంచి 70 సీట్లను బీజేపీ గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ నాయకులు సొంత ఆస్తులను మాత్రమే పెంచుకున్నారని చెప్పారు. కేసీఆర్ పరిపాలనలో సాగిన అవినీతి, అక్రమాలను త్వరలోనే తాము బయటపెడుతామని చెప్పారు.

 దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎసీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింత పెరుగుతోందని చెప్పారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పటాన్ చెరులో ఉన్న తమ ఫ్యాక్టరీని మూసివేయించారని ధ్వజమెత్తారు. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు తమపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.