రేపే సంపూర్ణ చంద్రగ్రహణం

సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం ఏర్పడనున్నది. ఈ ఏడాది ఏర్పడనున్న రెండో చంద్రగ్రహణం. ఈ నెల ఇంతకు ముందు దీపావళి రోజున సూర్యగ్రహణం సంభవించగా 15 రోజుల వ్యవధిలోనే కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడగా ఈ గ్రహణాలు రెండు వారాల వ్యవధిలోనే ఏర్పడడం విశేషం.

ఈ చంద్రగ్రహణం భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్‌, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా.. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనున్నది. చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేయనున్నది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు వరకూ కొనసాగుతోంది. భారత్‌లో గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకు కనిపించనున్నది. దేశంలో 45 నిమిషాల 48 సెకెన్ల పాటు దర్శనమిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

గ్రహణం ప్రారంభమైన దాదాపు గంట తర్వాత 3.46 గంటలకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. సాయంత్రం 4.29 గంటలకు దాని ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది. ఇలా 5.11 గంటల వరకూ సాగుతుంది. అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి కక్ష్య నుంచి భూమి తప్పుకోవడం మొదలై సాయంత్రం 6:19 గంటలకు గ్రహణం ముగుస్తుంది.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత కాలమానం ప్రకారం  మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా గ్రహణం కనిపించనున్నది. భారత్‌లో గ్రహణం సాయంత్ర సమయంలో దర్శనమివ్వనున్నది. దేశంలోని తూర్పు ప్రాంతాలైన కోల్‌కతా సహా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించే అవకాశం ఉన్నది.

చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, ఎటువంటి పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో ఎర్రగా మారిన చందుడ్రిని చూడొచ్చని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చంద్రగ్రహణం 5.28 గంటలకు, ముంబైలో 6.01 గంటలకు హైదరాబాద్‌లో 5.40 గంటలకు కనిపించనున్నది.