ఏడు ఉప ఎన్నికల్లో నాలుగు సీట్లు గెల్చుకున్న బీజేపీ

ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ నాలుగు సీట్లను గెల్చుకోగలిగింది. ప్రతిష్టాకరమైన హర్యానా, ఉత్తర ప్రదేశ్ లలోని ఒకొక్క సీట్లతో పాటు, బీహార్ లో ఓ సీట్ లో గెలుపొందింది. ఒడిశాలో మరో సీట్ గెల్చుకుంది. మహారాష్ట్రలో ఎన్నిక జరిగిన ఓ సీట్ లో పోటీ చేయక పోవడంతో ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన గెలుపొందింది. 
 
ఆరు సీట్లలో పోటీ చేసి నాలుగు సీట్లు గెలుపొందడం, గతంలో గల మూడు సీట్లకు అదనంగా మరో సీట్ గెల్చుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రజలు చూపుతున్న అభిమానానికి కొలమానమని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ తెలిపారు. ఫలితాలపై బిజెపి నేత అమిత్ మాల్యా వాఖ్యానిస్తూ బిజెపి విజయాలు సాధిస్తుంటే ఆప్ డిపాజిట్ కోల్పోయిందని, కాంగ్రెస్ యాత్రలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రలో అంధేరి ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉద్ధవ్‌ థాకరే వర్గం శివసేన అభ్యర్థి రుతుజా లట్కే ఘన విజయం సాధించారు. రుతుజాకు మొత్తం 66,247 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 12,776 ఓట్లతో నోటా రెండో స్థానంలో నిలిచింది. రుతుజా లట్కే భర్త రమేశ్‌ లట్కే మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక్కడ బిజెపి తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఆమెకు ప్రధాన పోటీ నోటాగా మిగిలింది.

హర్యానాలోని అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి భజన లాల్ మనవుడు భవ్య బిష్ణోయ్ ఘన విజయం సాధించారు. ఆయనకు 16 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఆయన వయసు 29 సంవత్సరాలు.

భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్‌పై ఘన విజయం సాధించారు.భజన్ లాల్ కుమారుడు కుల్‌దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కుల్‌దీప్ కుమారుడే భవ్య బిష్ణోయ్.

ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ  అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ బీజేడీ అభ్యర్తి  అబంతి దాస్‌ పై  9,881 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

బీహార్ లో బీజేపీ, ఆర్జేడీలకు చెరొక సీటు గెలుపు

బిహార్‌లోని గోపాల్ గంజ్, మొకామశాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ, ఆర్జెడి చెరొక సీటు  గెలుచుకున్నాయి.   గోపాల్ గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి విజయం సాధించగా, మొకామాలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి గెలిచారు. జేడీయూ-బీజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు కనిపించాయి.

బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ సింగ్ మరణించడంతో గోపాల్‌గంజ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి కుసుమ్ దేవి పోటీ చేసి, విజయం సాధించారు.  ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై కుసుమ్ దేవి సుమారు 1,800 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

మొకామా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి విజయం సాధించారు. అనంత్ కుమార్ సింగ్‌పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. నీలం దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోనం దేవిపై దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

అనంత్ కుమార్ సింగ్ నివాసం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఆయనపై నమోదైన కేసులో ఆయన దోషి అని పాట్నా కోర్టు తీర్పు చెప్పింది. అనంతరం ఎన్నికల కమిషన్ ఆయన ప్రజాప్రతినిధిగా కొనసాగడంపైనా, ఎన్నికల్లో పోటీ చేయడంపైనా అనర్హత వేటు వేసింది.