దేశంలో‌ త్వరలో దళిత హైందవ ఉద్యమం

దేశంలో‌ దళిత హైందవ ఉద్యమం త్వరలో ప్రారంభం అవుతుందని శ్రీ భువనేశ్వరీ పీఠం అధిపతి కమలానంద భారతి స్వామి తెలిపారు. ఆది ఆంధ్ర సమ్మేళనం 105  సంవత్సరాలు అయిన సందర్భంగా ఆదివారం విజయవాడలో తాళ్లూరి విష్ణువు అధ్యక్షతన సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సమరసత సమ్మేళనంలో పాల్గొంటూ  సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత ను పూర్తిగా విడనాడాలని పిలుపిచ్చారు.
 
సమాజాన్ని చదవాలి… అధ్యయనం చేయాలి.. కాలికి బలపం కట్టుకుని వీధి, వాడా తిరగాలని అప్పుడే సమాజంలోని స్థితిగతులు అర్థమవుతాయని, అసమానతలను ఏ విధంగా నిర్మూలించాలకో అవగతమవుతుందని తెలిపారు. కుల సమస్యలు పోవాలంటే, ముందు మన ఇంట్లో స్థితిని గమనించి, మన ఇంటి నుంచే అటువంటి చర్యలకు పూనుకొవాలని సూచించారు.
 నిజానికి కుల వ్యవస్థ గొప్పది. దీని వెనుక సైన్స్‌ ఉన్నది. కానీ, అసమానతలు ఈ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. హిందువు అంటే.. ముందు దళితుడేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. కుల వృత్తులను, కులాలను కించపరిస్తే దేశానికి అరిష్టమని హెచ్చరించారు.
నిజానికి  కుల వ్యవస్థే మన దేశానికి వెన్నుముక అని చెబుతూ పెరిక కులస్థుల ద్వారా విత్తన సమృద్ది జరుగుతుందని, నైపుణ్యమైన మేధస్సుకు కుల వృత్తులే నిదర్శనం అని స్పష్టం చేశారు.
 
వడ్డెరలు, ఉప్పరలు మన ప్రాచీన ఇంజనీర్లని పేర్కొంటూ కులంలోనే   మన దేశ ఆర్ధిక వ్యవస్థ దాగి ఉన్నదని స్వామిజి తెలిపారు. కుంకమలు, గులాలు, గాజులు తయారు చేసే కులాలూ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. బలిజలు తయారు చేసే గాజుల వ్యాపారం లక్ష కోట్ల రూపాయలని చెప్పారు. 
 
పద్మశాలీలు బట్ట తయారు చేసి ప్రజలకు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ఇలా ఎంతోమంది మన దేశ శాస్త్రవేత్తలు అంటూ  సైన్స్ అంటే ఇదే అని స్పష్టం చేశారు. దేవాలయాల్లో మాల, మాదిగలకు మాన్యాలు ఉన్నాయన్నది‌ వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 
కుల,మత‌ వైషమ్యాలు లేకుండా ఎంతోమంది కలిసి కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతూ దళిత సమాజం హైందవ సంస్కృతి ని అవలంబిస్తోందని కొనియాడారు. తాను కూడా చిన్న తనంలో అస్పృశ్యత ను అనుభవించానని, అయితే  ఆర్.యస్.యస్ ప్రచార కర్తగా కులాలకు అతీతంగా కలిసి పని చేశామని వివరించారు.
 
వర్ణం, వర్గం కాదు… మనమంతా మానవులం అనేది గుర్తించాలని స్వామిజి హితవు చెప్పారు.  ఆది ఆంధ్రులు అని సగర్వంగా చెప్పుకున్న వాళ్లు మాదిగలని చెబుతూ  ఎంతోమంది దళితులు స్వయం ప్రేరణతో కట్టుకున్న ఆలయాలే ఎక్కువ అని తెలిపారు. యేర్పేడు వ్యాసాశ్రమంలో అన్ని వర్గాల వారికి వేదాంతం నేర్పారని గుర్తు చేశారు. 
 
కేంద్ర మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం, సాంఘిక  బహిష్కరణలపై చర్చ జరగవలసి ఉందని చెప్పారు.  భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళ నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవాల వేళ దళితులకు ఏం మేలు జరిగింది? ఇంకా వారి సంక్షేమానికి ఏం చేయాలి అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
 
అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే, సమాజంలోని సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. రాజకీయ నేత నుంచి సామాన్యుడి వరకూ ప్రతి ఒక్కరూ ఒక సామాజిక కార్యకర్తగా తయారై, అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ వంతు కృషి సల్పాలని కోరారు. 
మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ  అస్పృశ్యత, అంటరాని తనం పై నేటికీ పుస్తకాలు రాస్తున్నామని  ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం లో సంస్కరణల ద్వారానే మార్పు సాధ్యం అని స్పష్టం చేశారు. మతం మార్చుకోవడం వల్ల ఎవరికీ ఒరిగిందేమీ లేదని, వాళ్ళ హోదా  కూడా పెరగదని స్పష్టం చేశారు. 
 
 గాంధీజీ కూడా మతం మారొద్దన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నేడు కుల సమస్య ఆయా కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొంటూ  సమాజం చైతన్యవంతమై ఈ సమస్యను నిర్మూలించాలని చెప్పారు. 
 
నిజానికి కులం అనేది ఒక ‘సంస్కృతి’… ఈ విషయాన్ని విస్మరించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా దళితుల పట్ల ఉన్న చిన్నచూపును తొలగించేందుకు సామాజిక సమరసత వేదిక ఈ సమ్మేళం నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.
దేశంలో రేజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నదని ప్రస్తావిస్తూ అన్ని విభాగాలలో రేజర్వేషన్లు పొందినవారే పొందుతూ వస్తున్నారని చెప్పారు. సంపన్నులు  రేజర్వేషన్లు పొందుతూ ఉండడం కారణంగా పెదాలు నష్టపోతున్నారని తెలిపారు. ముందుగా పేదలకు రేజర్వేషన్లను అమలు పరచాలని ప్రసాద్ స్పష్టం చేశారు.
హిందూ మతం ఏళ్ళనాటి తప్పులను గుర్తించి, సంస్కరించుకుంటుందని, ఇది శుభపరిణామమని ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ తెలిపారు. భారతీయ గడ్డపై జన్మించిన ఎవరిని దూరం పెట్టడడం దేశానికి మంచిది కాదని హెచ్చరించారు. అందరూ మనవారేనన్న భావన సమాజంలోని చివరి వ్యక్తి వరకు వెళ్ళాలని చెప్పారు. 
 
ఇప్పడు సంఘం చేస్తున్నది ఇదేనని పేర్కొన్నారు. అయితే, సమాజం నుంచి ఇంకా మద్దతు అవసరముందని తెలిపారు. ఒకనాడు గాంధీ, అంబేద్కర్‌ సంఘ్‌ శిబిరాలను సందర్శించారని, అక్కడ కుల ప్రస్తావన, వివక్ష లేకపోవడంతో ఆశ్చర్యపోయారని ఆయన గుర్తు చేశారు. అంతా భారతమాత బిడ్డల వలే కలిసిమెలిసి ఉండడం సంఘ్‌ నేర్పిన క్రమశిక్షణ అని తెలిపారు. ఇదే సామాజిక దురాచారాలను రూపుమాపడానికి ఏకైక మార్గమని పేర్కొన్నారు.
ఎంతో చరిత్ర ఉన్న మన దేశంలో కులాల అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ మాజీ  ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు తెలిపారు.  మూలవాసి లేని హైందవమే లేదని పేర్కొంటూ  కులం, మతం వేరేనా… కొలిచే పేరు వేరైనా… సర్వాంతర్యామి ఒక్కరే అని స్పష్టం చేశారు. ఆలయ వ్యవస్థ ను హైందవ ధర్మ పరిరక్షణ వేదికగా మార్చేలా చర్యలు అవసరమని చెప్పారు.
మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, సామాజిక సమరసత రాష్ట్ర  మహిళా కన్వీనర్ కోడూరి జయప్రద తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆచార్య వెంకటేశ్వర్లు రాసిన “నీరుద్ధ భారతం,పద్యం,అర్థం”,  డా.దుగ్గరాజు శ్రీనివాస రావు రాసిన “కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు”,  ఆచార్య పులి కొండ సుబ్బాచారీ రాసిన  “వచన నీ భారతం” గ్రంధాలను ఆవిష్కరించారు.